Wednesday, January 22, 2025

రూ.7 లక్షల కోట్లు ఆవిరి

- Advertisement -
- Advertisement -

Sensex lost 1416 points

మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద
1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం

ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే పెట్టుబడిదారులు రూ. 7 లక్షల కోట్లు కోల్పోయారు. గ్లోబల్‌గా ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్‌మార్కెట్లో పెట్టుబడిదారులు అత్యధికంగా లాభాల స్వీకరణ చేపట్టారు. యుఎస్ మార్కెట్లు భారీపతనం అవుతున్నాయి. దీంతో భారతీయ స్టాక్‌మార్కెట్లు కూడా కుప్పకూలాయి. మరోవైపు గురువారం ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నుండి భారీ అమ్మకాలు జరిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ కీలక మార్క్ 53,000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 16,000 దిగువన ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,416 పాయింట్లు నష్టపోయి 52,792 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 430 పాయింట్లు కోల్పోయి 15,809 పాయింట్ల వద్ద స్థిరపడింది. రంగాల వారీగా చూస్తే అన్ని సెక్టార్లలో నష్టాలు కనిపించాయి.

బ్యాంక్ నిఫ్టీ 2.48 శాతం అంటే 846 పాయింట్లు పతనమై 33,318 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, ఎనర్జీ, మీడియా రంగాల్లో కూడా భారీ క్షీణత కనిపించింది. నిఫ్టీలోని 50 షేర్లలో కేవలం మూడు షేర్లు మాత్రమే గ్రీన్‌లో ముగియగా, 47 షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో కూడా మూడు షేర్లు మాత్రమే లాభపడగా, మిగతా 27 షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి. స్టాక్ మార్కెట్ భారీ పతనమైనప్పటికీ ఐటిసి 3.34 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 0.41 శాతం, పవర్ గ్రిడ్ 0.11 శాతం లాభాలతో ముగిశాయి. పతనమైన స్టాక్స్‌ను పరిశీలిస్తే, విప్రో 6.35 శాతం, హెచ్‌సిఎల్ టెక్ 5.92 శాతం, ఇన్ఫోసిస్ 5.47 శాతం, టిసిఎస్ 5.22 శాతం, టెక్ మహీంద్రా 5.19 శాతం, టాటా స్టీల్ 4.83 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.96 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.5 శాతం, 2.5 శాతం బ్యాంక్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.08 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 2.18 శాతం నష్టపోయాయి.

రూపాయి మరింత పతనం

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా పతనమైంది. గురువారం 10 పైసలు బలహీనపడి 77.72 వద్ద ముగిసింది. 77.72 వద్ద ప్రారంభమైన రూపాయి, ట్రేడింగ్‌లో కనిష్ట స్థాయి 77.76, గరిష్టంగా 77.63 వద్ద కనిపించింది. అంతకుముందు బుధవారం 18 పైసలు బలహీనపడి 77.62 వద్ద ముగిసింది. ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) అనూజ్ గుప్తా మాట్లాడుతూ, ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో రూపాయి 79కి బలహీనపడవచ్చని అన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే ఏదైనా ఇతర కరెన్సీ విలువ తగ్గితే, ఆ కరెన్సీని బలహీనపరచడం అంటారు. ప్రతి దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వలను కలిగి ఉంటుంది, వాటితో అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహిస్తుంది. విదేశీ మారక నిల్వల తగ్గుదల, పెరుగుదల ఆ దేశ కరెన్సీ కదలికను నిర్ణయిస్తాయి. భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్, రూపాయి నిల్వలు సమానంగా ఉంటే రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. రూపాయి బలహీనపడితే ముడి చమురు దిగుమతి భారంగా మారుతుంది. పర్యవసానంగా ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దేశంలో కూరగాయలు, ఆహార పదార్థాలు ఖరీదైనవి. అయితే ఎగుమతిదారులు ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో వస్తువులను విక్రయించే ఐటీ, ఫార్మా కంపెనీలకు మేలు జరుగుతుంది.

డా.రెడ్డీస్ లాభం 76 శాతం డౌన్
మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో డా.రెడ్డీస్ ల్యాబ్ నిరాశపర్చింది. కంపెనీ నికర లాభం రూ.87.5 కోట్లతో 75.85 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.362 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.5,436 కోట్లతో 15 శాతం పెరిగింది, గతేడాది ఇదే సమయంలో ఈ ఆధాయం రూ.4,728 కోట్లుగా ఉంది. నార్త్ అమెరికా వ్యాపారం 6 శాతం వృద్ధిని సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News