ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మెటల్, పవర్, ఫైనాన్షియల్ షేర్స్ లాభపడడంతో మార్కెట్లు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఇండెక్స్ దిగ్గజ షేర్లు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎయిర్‌టెల్‌లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ లాభాలను తగ్గించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79.22 పాయింట్లు పెరిగి 65,075 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 19,342 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ స్టాక్స్‌లో కొన్ని రోజులుగా పతనమవుతున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ 4.72 శాతం పెరిగింది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్‌టిపిసి, జెఎస్‌డబ్లు స్టీల్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు కూడా లాభపడ్డాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, హిందుస్తాన్ యునిలివర్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి.