Monday, December 23, 2024

ఇంధన స్టాక్స్ కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

204 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : సుదీర్ఘ సెలవుల తర్వాత దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. మంగళవారం మార్కెట్‌లోని చాలా రంగాల స్టాక్‌లు పెరిగాయి. అదానీ గ్రూప్, ఇంధన రంగాల స్టాక్స్ పెరగడంతో మార్కెట్ ఉత్సాహంగా కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 66,174 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 19,890 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ట్రేడింగ్‌లో ఎనర్జీ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ దాదాపు 700 పాయింట్ల జంప్‌తో 29,253 పాయింట్లకు చేరింది. బ్యాంకింగ్, ఆటో, ఐటి, మెటల్స్, కమోడిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు కూడా లాభాలతో ముగిశాయి. హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా రంగాల షేర్లు మాత్రమే క్షీణించాయి. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో అద్భుతమైన పెరుగుదల కనిపించింది. స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా వరకు పెరగలేదు. నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 38 స్టాక్‌లు గ్రీన్‌లో ముగియగా, 12 నష్టపోయాయి. మరోవైపు సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 17 పెరగ్గా, మిగతా 13 నష్టాలతో ముగిశాయి.

ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8.90 శాతం, అదానీ పోర్ట్ 5.30 శాతం, టాటా మోటార్స్ 3.53 శాతం, బిపిసిఎల్ 3.39 శాతం, కోల్ ఇండియా 2.75 శాతం పెరుగుదలతో ముగిశాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్ 0.64 శాతం, ఐటిసి 0.58 శాతం, ఐషర్ మోటార్స్ 0.58 శాతం నష్టపోయాయి. మార్కెట్ పెరుగుదల కారణంగా బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్‌లో వృద్ధి నమోదైంది. మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.328.7 లక్షల కోట్లుగా ఉండగా, రూ.331.10 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.2.4 లక్షల కోట్లు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News