ముంబై : స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్వ లాభాలతో ముగిశాయి. సోమవారం ప్రారంభంలోనే మార్కెట్లు భారీగా పతనం కాగా, ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల బాటపట్టాయి. ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్‌లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు జంప్ చేశాయి. మరోవైపు యురోపియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల వల్ల మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79.7 పాయింట్లు పెరిగి 65,401 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే ఓ దశలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు నష్టపోయింది. కానీ ఆ తర్వాత కోలుకుని లాభపడింది. ఇక నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 19,434 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో హిందుస్తాన్ యునిలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లె, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి.
మరోవైపు జెఎస్‌డబ్లు స్టీల్, ఎస్‌బిఐ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్బ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలను చవిచూశాయి. ఎఫ్‌ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) శుక్రవారం దాదాపు రూ.3,073 కోట్ల విలువ షేర్లను విక్రయించారు. గ్లోబల్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ 0.33 శాతం క్షీణించింది.