Monday, December 23, 2024

ఐటి, బ్యాంకింగ్‌లో కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. క్రితం రోజు 65 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్, మంగళవారం మరింత ముందుకు వెళ్లింది. ఇక నిఫ్టీ 19,500 పాయింట్ల మార్క్‌కు చేరువ అవుతోంది. మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయి గరిష్ఠంలో మార్కెట్లు ముగిశాయి. ఐటి, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 65,479 వద్ద ముగిసింది.

ఇక నిఫ్టీ 66 పాయింట్ల జంప్‌తో 19,389 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయిలో 145 పాయింట్లు (0.32 శాతం) లాభంతో 45,301 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటి 305 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగింది. ఇది కాకుండా ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మెటల్స్ రంగ షేర్లలో క్షీణత కనిపించింది. ట్రేడింగ్‌లో మిడ్ క్యాప్ రంగ షేర్లలో క్షీణత కనిపించగా, స్మాల్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 19 లాభాల్లో, 11 నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 7.17 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 5.76 శాతం లాభంతో కనిపించాయి. టెక్ మహీంద్రా 2.39 శాతం, సన్ ఫార్మా 1.61 శాతం, ఎన్‌టిపిసి 1.54 శాతం, టైటాన్ కంపెనీ 1.39 శాతం లాభంతో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్ 1.54 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.18 శాతం, రిలయన్స్ 1.04 శాతం చొప్పున నష్టపోయాయి. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ కొత్త గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.298.33 లక్షల కోట్ల వద్ద ఉండగా, మంగళవారం ఇది రూ.298.65 లక్షల కోట్లకు జంప్ చేసింది. అంటే ఇన్వెస్టర్ల సంపద రూ.32,000 కోట్లు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News