Friday, December 20, 2024

భయపెట్టిన బేర్

- Advertisement -
- Advertisement -

హెచ్చుతగ్గులతో మార్కెట్లు,
గతవారం సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్

ముంబై : గతవారం స్టాక్‌మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బుధవారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్‌లో అమ్మకాల ప్రభావంతో బేర్ విజృంభించగా, ఇన్వెస్టర్లు భయాందోళన చెందారు. అయితే వారాంతంలో మార్కెట్ కోలుకుంది. మొత్తంగా చూస్తే వారంలో సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయింది. ఐదు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇక నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పడిపోయింది. ఈ సూచీ ఐదు రోజుల్లో 2 శాతం నష్టపోయింది. మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారాంతం శుక్రవారం మార్కెట్లు ఉత్సాహంగా కనిపించాయి. ఎఫ్‌ఎంసిజి, ఐటి, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ లాభాల్లోకి వెళ్లింది.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్‌కు జోష్ ఇచ్చాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 497 పాయింట్ల లాభంతో 71,683 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్ల జంప్‌తో 21,622 పాయింట్ల వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో రూ.369.75 లక్షల కోట్లు ఉండగా, ఇది రూ.373.65 లక్షలకు చేరుకుంది. అంటే శుక్రవారం ట్రేడ్‌లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర పెరిగింది. అయితే బుధవారం రోజు మార్కెట్లు ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి.

మంగళవారం స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు మరుసటి భారీ నష్టాలను చూశాయి. దీంతో ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.4.7 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్‌లో భారీ అమ్మకాలు మార్కెట్ కుప్పకూలడానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ 72 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆఖరికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు నష్టపోయి 71,500 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి నిఫ్టీ 21,571 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ రికార్డు స్థాయి పతనం మార్కెట్‌ను దెబ్బతీసింది. నిఫ్టీ 50లో భారీ పతనం 2022 జూన్ తర్వాత ఇప్పుడే, సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. కానీ ఆఖరి రోజు పుంజుకున్నాయి.

క్యూ3 ఫలితాల ప్రభావం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో పాటు రిలయన్స్ జియో, రిటైల్ కంపెనీలు ఫలితాలను ప్రకటించాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ.19,641 కోట్లతో 11 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే సమయంలో లాభం రూ.17,706 కోట్లుగా ఉంది. అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు ఉన్న మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ నికర ఆదాయం 3.2 శాతం పెరిగి రూ.2,48,160 కోట్లకు చేరుకుంది. ఇక రిలయన్స్ టెలికాం కంపెనీ జియో ప్లాట్‌ఫాం లిమిటెడ్ క్యూ3 నికర లాభం వార్షికంగా 12 శాతం పెరిగి రూ. 5,208 కోట్లుగా ఉంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,638 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వీటి ప్రభావం శనివారం ట్రేడింగ్‌లో కనిపించనుంది. స్టాక్‌మార్కెట్ శనివారం (జనవరి 20) నాడు ట్రేడింగ్ నిర్వహిస్తోంది. రెండు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ రెంటింట్లో ట్రేడింగ్ జరుగనుంది. ఇది సెబీ మార్గదర్శకాల్లో భాగంగా డిజాస్టర్ రికవరీ(డిఆర్) సైట్‌కు ట్రేడింగ్ వ్యవస్థను మార్పు చేయడం కోసం నిర్వహిస్తున్నారు. శనివారం ట్రేడింగ్ సమయాలు సాధారణంగా ఉండవు. శనివారం స్టాక్ మార్కెట్లో అన్ని నగదు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ షేర్లలో 5% సర్క్యూట్ ఉంటుంది.

అయితే, 2% సర్క్యూట్లు ఉన్న కంపెనీల సర్క్యూట్లలో ఎటువంటి మార్పు ఉండదు. విశేషమేమిటంటే శనివారం జరిగిన డీల్స్ సోమవారం సెటిల్ కానున్నాయి. జనవరి 20న దాదాపు సగం రోజు పాటు రెండు సెషన్లలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది. ఈ ట్రేడింగ్ డిజాస్టర్ రికవరీ సైట్‌ను పరీక్షించడం కోసం ఉంటుంది. వ్యాపారులు లైవ్ సెషన్‌లో షేర్లను కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. కానీ మీరు శుక్రవారం కొనుగోలు చేసిన షేర్లను శనివారం విక్రయించలేరు. అలాగే, సాధారణ ట్రేడింగ్ రోజులతో పోలిస్తే వాల్యూమ్‌లో తగ్గుదల ఉండవచ్చు. అన్ని ఒప్పందాల సెటిల్మెంట్ సోమవారం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News