డ్రగ్స్ కేసులో ముంబై కోర్టు ఎనిమిది మంది పాకిస్థాన్ పౌరులకు జైలు శిక్ష విధించింది. 2015లో దాదాపు రూ. 7 కోట్ల విలువైన 200 కిలోల డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వారికి శిక్షలు ఖరారు చేశారు. గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2 లక్షల చొప్పున జరిమానా విధించారు. 2015లో గుజరాత్‌తీరంలో హెరాయిన్‌ను తరలిస్తున్న బోటును భారత కోస్ట్‌గార్డ్ అధికారులు పట్టుకున్నారు.
ఆ బోటులో 11 డ్రమ్ములు, గోధుమ వర్ణం లోని పొడితో కూడిన 20 ప్లాస్టిక్ పౌచ్‌లను గుర్తించారు. ఆ ప్యాకెట్ల లోని పదార్థాన్ని గుర్తించగా, హెరాయిన్ అని తేలింది. ఎనిమిది మంది పాకిస్థాన్ జాతీయులతోపాటు , మూడు శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ నావిగేషన్ చార్ట్‌లు , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. అనంతరం నిందితులను దక్షిణ ముంబై పోలీస్‌లకు అప్పగించారు. అయితే ఈ కేసులో నిందితులకు గరిష్ఠంగా శిక్షవిధించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమేశ్ పుంజ్వానీ కోర్టును అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి ఈ కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేశారు.