ఉక్రెయిన్ వేర్పాటువాద నేతల ప్రకటన
రష్యాలోని సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
ఉలిక్కి పడిన ప్రపంచ దేశాలు
మాస్కో: ఉక్రెయిన్‌నుంచి విడిపోయిన రెండుప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు మరింత తీవ్రమవుతాయనే భయాలు మొదలయ్యాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని భాగాల్లో దాడులు గణనీయంగా పెరిగాయని యూరప్‌లోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ నిపుణులు నివేదిక ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే ఈ ప్రకటనలు వెలువడడం గమనార్హం. ఈ మేరకు శనివారం తాజాగా జరిగిన దాడులపై ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల డొనెట్స్ పీపుల్స్ రిపబ్లిక్ నాయకుడు డెనిస్ పుషిలిన్ తన తోటి సైనికులను సైనిక నిర్బంధ కార్యాలయానికి రమ్మని కోరడమే కాకుండా తాము యుద్ధానికి సిద్ధమనే డిక్రీపై సంతకం చేసిన విషయం గురించి ఓ వీడియోలో వెల్లడించాడు. లుగాన్స్ వేర్పాటువాద ప్రాంత నాయకుడు లియోనిద్ పసెచ్నిక్ కూడా అదే సమయంలో తన ప్రాంతంలోని దాడులను తిప్పి కొట్టడానికి సిద్ధం అని సంతకం చేసిన డిక్రీని ప్రచురించాడు.
అయితే ఉక్రెయిన్ భద్రతా దళాలే దాడులు మొదలు పెట్టాయని.. తాము ఆ దాడులను అడ్డుకున్నామని వేర్పాటువాద నాయకుడు పుషిలిన్ పేర్కొన్నాడు. అంతేకాదు తామంతా కలిసికట్టుగా విజయం సాధించడమే కాకుండా రష్యా ప్రజలను కాపాడుతామని ప్రకటించాడు. కాగా 2014లో రష్యాలో విలీనమైన క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం ఉక్రెయిన్ వేర్పాటువాదులపై దాడులు జరుపుతోందన్న ఆరోపణలను ఉక్రెయిన్ ప్రభుత్వం ఖండించింది. ఇదిలా ఉండగా వేర్పాటువాదుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో తాజాగా పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున రష్యాలోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వేర్పాటువాద ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతాల వారికోసం రష్యా 7 లక్షలకు పైగా పాస్‌పోర్టులను జారీ చేసినట్లు వారు తెలిపారు. ముందుగా మహిళలు, పిల్లలు, వృద్ధులను తరలిస్తామని తెలిపారు.