వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న భారత్ బంద్
సంయుక్త కిసాన్ మోర్చ పిలుపు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్‌కెఎం) సెప్టెంబర్ 25న భారత్ బంద్‌కు శుక్రవారం పిలుపు ఇచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నవంబర్‌లో ప్రారంభమైన రైతుల ఆందోళనను మరింత బలోపేతం చేయడంతోపాటు విస్తరించే లక్షంతో భారత్ బంద్ నిర్వహించనున్నట్లు ఎస్‌కెఎం తెలిపింది. ఎస్‌కెఎం నాయకుడు ఆశిష్ మిట్టల్ శుక్రవారం ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాది ఇదే రోజున భారత్ బంద్ నిర్వహించామని, మళ్లీ ఈ ఏడాది అదే రోజున భారత్ బంద్ నిర్వహించనున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో గత ఏడాది భారత్ బంద్ నిర్వహించామని, ఈ ఏడాది మరింత విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు నిర్వహించిన రెండు రోజుల అఖిల భారత సదస్సు జయప్రదంగా శుక్రవారం ముగిసిందని మిట్టల్ తెలిపారు. 22 రాష్ట్రాలకు చెందిన 300 కార్మిక సంఘాల ప్రతినిధులతోపాటు మహిళలు, కార్మికులు, గిరిజనులు, యువజనులు, విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సంఘాల సభ్యులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారని ఆయన చెప్పారు.