Tuesday, November 5, 2024

కొత్త పుస్తకాల నెల సెప్టెంబర్

- Advertisement -
- Advertisement -

A reader lives a thousand lives before he dies. The man who never read s lives only one George R.R. Martin
‘Show me a family of readers, and I will show you the people who move the world –Napolon Bonaparte

శరీరానికి వ్యాయామం ఎట్లనో మెదడుకు పఠనం అట్లాంటిదన్నారు పండితులు. గొప్ప జ్ఞాపకశక్తి, ఏకాగ్రత -నిశిత దృష్టి, ఆహ్లాదం- ఒత్తిడి అధిగమనం, తాదాత్మ్యంతో కూడిన సృజనాత్మకత, అభిజ్ఞా చైతన్యం చదువరులకు పఠనం ప్రసాదించే సామర్థ్యాలు. అభివృద్ధి చెందిన దేశాల్లో అక్షరాస్యుల నిత్యకృత్యాల్లో బుక్ రీడింగ్ ఒకటి. కాకపోతే మన లాంటి సమాజాల్లో పుస్తకాలు చదవాలనే ఉత్సాహం అందరికీ ఒకేలా ఉండదు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులు పఠనం అలవరచుకోవాడాన్ని పెంపొందించుకోవడాన్ని సవాలుగా భావిస్తున్నట్టు, మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు పుస్తక పఠనం మీద మక్కువ ఉన్నప్పటికినీ హోమ్ వర్కు, ట్యూషన్ల మూలంగా మంచి పుస్తకాలను సైతం సకాలంలో చదువలేకపోతున్నట్టు ‘పఠనాసక్తి సర్వేలు’ వెల్లడిస్తున్నాయి.

ప్రపంచీకరణ అనంతరం స్థాపితమైన అనేక పరిశ్రమల్లో ప్రచురణా పరిశ్రమ కూడా ఇతోధికమైన సేవలందిస్తూ వస్తుంది. సాహిత్యం, కళలు, సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లక్షణ గ్రంథాలు, చరిత్ర-సంస్కృతి, విద్య, వైద్యం, ఆర్థికం, క్రీడలు, వినోదం, వాణిజ్యం, మేనేజెమెంట్, రాజకీయాలు, కెరీర్ డెవలప్ మెంట్, ఆధ్యాత్మికం, పర్యావరణం, అంతరిక్ష పరిశోధన, వస్తు సేవలు, టూరిజం, జీవితానుభవాలు ఇత్యాది విభాగాల్లో దేశ విదేశాల రచయితలు వెలువరించిన రచనలు ఇప్పుడు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆయా పత్రికలు ‘ఫిక్షన్, నాన్-ఫిక్షన్’ ప్రక్రియల్లో ముద్రితమైన పుస్తకాల వివరాలను వారం వారం ప్రకటిస్తున్నాయి. సమాజంలో సమస్యలు, వివిధ వర్గాల అభివృద్ధి- స్వావలంబన, ప్రాపంచిక మనుగడకు సంబంధించిన పుస్తకసమీక్షలను, రచయితల ఇంటర్వూలను ప్రచురిస్తున్నాయి.

ఇదివరకటిలా పుస్తకాలు కొనుక్కోవడానికి పట్టణాలకూ, నగరాలకూ ప్రయాసపడి వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎటువంటి పుస్తకాన్నైనా ఆన్‌లైన్లో ఇంటికి తెప్పించుకునే సౌకర్యాన్ని ఆటోమేషన్ మనకు కల్పించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఉపాధ్యాయ దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం, హిందీ దివస్, ఇంజినీర్స్ డే (భారత దేశం), అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంవంటి ప్రత్యేకతలతో పాటు సెప్టెంబరు నెలకు ‘న్యూ బుక్ రీడింగ్ మంత్’ అని కూడా పేరు. చదవగలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొత్త పుస్తకాలు చదవాలని, గ్రంథ జీవనశైలి (బిబిలియో లైఫ్ స్టైల్) కి పరిణతి చెందాలనే ఉద్దేశమై మీతో విషయాలు ప్రస్తావిస్తున్నాను.
పఠనావశ్యకత గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

అందునా యువతకు అసలే అక్కర లేదు. ఎందుకంటే పఠనం బహుళ ప్రయోజనకారి అని ముందే సెలవిచ్చాను. అదే పనిగా ‘పఠనమే గొప్ప శక్తి, పుస్తకాలే నిజమైన స్నేహితులు, పుస్తకాలు అవతలి ప్రపంచాలకు కిటికీలు, పుస్తకాలు కమ్యూనికేషన్ నిశ్శబ్ద రూపం, పుస్తకాలు అంతులేని అవకాశాలకు ద్వారం, పుస్తకాలే నిజమైన లెవలర్లు, పఠనం మిమ్మల్ని వివేకవంతులుగానూ మరింత సంస్కారవంతులుగా మారుస్తుంది’ అని గుర్తు చేయాల్సిన గత్యంతరమూ లేదు. ‘రీడ్ ఎ బుక్ మంత్’ గా సెప్టెంబరునెల మీద గౌరవంతో మాత్రమే అభిప్రాయాలు మీతో పంచుకుంటున్నాను. ఈ నెల.. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరినీ తమ జీవితంలో వీలైనన్ని ఎక్కువ పుస్తకాలను కొనుక్కోవాలని, పుస్తకాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవాలని, జీవితాన్ని సృజనాత్మకంగా గడపాలని, పఠనానుభవంతో సమకూరిన మేధస్సుతో సరికొత్త ఆలోచనలు చేస్తూ తత్వశాస్త్రానికి మరిన్ని శాఖలను స్థాపించమని కోరుతున్నది.

అయితే, సెప్టెంబరు ఒక్కటే కొత్త పుస్తకాలు చదవాల్సిన నెల కాదు. పుస్తకాల లోలోపలి ప్రతిపుట నుండి ప్రాప్తించే జ్ఞానం గురించి, ఆనందం గురించిన పాఠకుడిలో చెలరేగాల్సిన దాహానికి అంకురార్పణ జరగాల్సిన నెలగా, తదుపరి సంవత్సర కాలం పాటు దైనందిన కార్యక్రమంగా రీడింగ్ షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సెప్టెంబరు క్యాలెండరులో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మారిన కాలమాన పరిస్థితుల్లో ఆన్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ల మీద పెద్ద సమయం వెచ్చించడం ఆపేసి విద్యార్థులు పుస్తక పఠనాన్ని ఎంత ముందస్తుగా అలవరచుకుంటే అంత మంచిది. మన హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఐటి ప్రొఫెషనల్ రవి నీలకంఠన్ ఏం చెబుతన్నాడో చూడండి.

‘I was lucky to have been bitten by the reading bug quite early in life. I find solace in reading whenever things become overtly chaotic. Reading is like meditation to me. I find it very soothing when things are going south. I truly owe alot to books’ అంటున్న నీలకంఠన్ పఠనానుభూతి ఇష్టపడి చదివిన ప్రతి పాఠకుడికి అనుభవంలోకి రాగలదు. డిలాన్ థామస్ మహాశయుడు ‘నోట్స్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ’ కవితలో అన్నట్టు చూస్తే పుస్తకాలు రెండు మామూలు అట్టలతో చేతికి అమరే పదార్థాల్లా ఉంటాయే కానీ, వాటి పేజీలమధ్య పదాల ఇసుక తుఫానులు, మంచు విస్ఫోటనాలు, అలవికాని అస్థిరమైన శాంతి, అపారమైన హాస్యం, ఎంతెంత కళ్లు చెదిరే దేదీప్యమానమైన వెలుగు, ఆ వెలుగుజిలుగుల చిందుల మధ్య జరుగుతాయని కలలో కూడా ఊహించని సంఘటనలు.

పేజీలన్నింటిలో శకలాలు శకలాలుగా పరచుకున్న అద్భుత కథనాలు, ప్రతి పదంలో దాని సొంతమే అయిన ఆనందం వైభవం అసామాన్యత, ఎల్లప్పుడూ తొణికిసలాడే సజీవమైన కాంతి పుస్తకంలో తప్ప మరో చోట ఎక్కడా దొరకవు గాక దొరకవు. మహానుభావుడు ఫెడరిక్ డగ్లస్ “పఠనం ఒకసారి అలవరచుకొని చూడండి, ఎల్లప్పుడూ మీరెంత స్వేచ్ఛగా ఉంటారో మీకే తెలుస్తుంది” అంటాడు కదా! నిజమే, స్వేచ్ఛ కలిగిన వ్యక్తులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్నిటినీ పొందగలుగుతారు. ఇతరుల ఆధిపత్యం నుండి దౌర్జన్యం నుండి తమను తాము కాపాడుకోగలుగుతారు. ప్రధానంగా తాత్త్విక, మేధో, కళా వైజ్ఞానిక రంగాల్లో కొత్తభావనలకు నవకల్పనలకు ప్రాథమిక వనరుగా ఉండేది స్వేచ్ఛనే. సమాజంలో ఏ సమస్యకైనా కారకులను కారకాలనే కాదు పరిష్కారాలను కనుగొనేందుకు, సముచిత ఆలోచనలు చేసేందుకు పరమ సాధనమూ స్వేచ్ఛనే. డగ్లస్ చెప్పినది ఇదిగో ఈ తరహా స్వేచ్ఛ గురించే. స్టీఫెన్ హాకింగ్స్ పుస్తకం ‘బ్రీఫ్ ఆన్సర్స్ ద బిగ్ క్వశ్చన్స్’ ఉద్ఘాటిస్తున్నట్టు ఈ విశ్వానికి సంబంధించిన మహా ప్రశ్నలకూ పుస్తకాలే సమాధానం చెప్పగలవు.

విద్యకు సంబంధించి సంస్కృతంలో ‘స్వయం ప్రజ్ఞ’ అనే ఒక మాట ఉంది. స్వయం ప్రజ్ఞను ఇంగ్లీషులో ‘సెల్ఫ్ అవేర్ నెస్’ అంటున్నాం. ప్రాపంచిక గమనంలో మునపటి రోజులకు ఇవాళ్టి పరిస్థితులకు వైవిధ్యం సరేసరి, వైరుధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శాస్త్రీయంగా ఈ యుగానికి ఎన్ని ముద్దు పేర్లున్నప్పటికినీ, మనం జీవిస్తున్న ఈ యుగాన్ని సామాజిక వేత్తలు ‘ఏజ్ ఆఫ్ మోరల్ డిస్టోపియా’ అని పిలుస్తున్న విషయాన్ని మనం మరచిపోరాదు. పందొమ్మిది వందల తొంభై అనంతర కాలమే ఏజ్ ఆఫ్ మోరల్ డిస్టోపియా. దీని అర్థం విలువల స్థానభ్రంశ యుగం అని. ఇప్పుడు స్వయంప్రజ్ఞ లేకపోతే వ్యక్తులకే కాదు వ్యవస్థలకూ ఉనికి కష్టంగాక కష్టం. ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టు అండ్రియా ఎలియట్ రచన 2022 సంవత్సరపు పులిట్జర్ బహుమతికి ఎంపికైన ‘ఇన్ విజబుల్ చైల్ ’, ప్రముఖ హిందీ రచయిత మనోజ్ రూప్డా ‘కాలే అధ్యాయ్’కి ఆంగ్లానువాదం, జెసిబి సాహిత్యపురస్కారం పొందిన నవల ‘ఐ నేమ్డ్ మై సిస్టర్ సైలెన్స్’లను చదివితే ఆదివాసీ బస్తర్ అటవీ ప్రాంతపు మారుమూల బతుకుల నుండి అంతర్జాతీయ మహానగరం న్యూయార్క్ సిటీ లైఫ్ వరకు గల మానవాళి బాహిరంతర సంఘర్షణలు, విలువల స్థానభ్రంశత తీవ్రత ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తాయి. ఇంతెందుకు మన పొలిటికల్ కామెంటేటర్ నీరజా ఛౌదరి ఇటీవల వెలువరించిన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ గ్రంథ చదివితే మన ప్రధానులు ఎవరెవరు ఏయే నిర్ణయాలు ఎట్లా ఎందుకు తీసుకున్నారో విదితం కాగలదు. ఇంకో మాట కూడా నిర్భయంగా చెబుతున్నాను.

జీవితాన్ని తప్పు దారి పట్టించే గుడ్డి నమ్మకాల తెలివితక్కువతనాల సమూహా (కల్ట్)లు, వీటికే వత్తాసుపలికే ‘మీ-ఇస్టులు’ చుట్టుముట్టిన కాలమిది. ముప్పుతప్పించి దారి చూపించగల ధీమంతులెవరంటే, ఇంకెవరు? మరి, రచయితలు. పుస్తకాలే సమ్యగ్దృష్టికి పర్యాయ పదాలు. మనందరికీ యధాలాపంగా ఓ అలవాటుంది. అదేమిటంటే, మన కళ్లెదుట యుద్ధమే జరిగిందనుకోండి, హింసను రక్తపాతాన్ని విజేత పరాక్రమాన్ని, పరాజితుడి బలహీనతలను అంచనా వేస్తుంటాం. అయితే రచయిత కూడా మనలాగే హింస దగ్గరే కళ్లు రెట్టించడు. గెలుపోటముల ద్విపక్షాల్లో మనుషులుగా నిలబడిందెవరో ఎత్తిచూపి ఒకవేళ అది అమానవీయంగా ప్రాప్తించిన విజయమే అయితే దాన్ని రచయిత ఎంతమాత్రం లక్ష్య పెట్టడు. రచయితకు కావలసింది మానవత్వ విజయమే కాని, విజేత విజయమూ ఆక్రమిత సమస్త రాజ్యమూ కాదు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు నిరక్షరాస్యుల మీద అక్షరాస్యులూ, దరిద్రుల మీద ధనవంతులూ పరిపాలన సాగిస్తున్న వ్యవస్థ మనది. కాలక్షేపానికి కాకుండా ఒక దృక్పథంతో కూడిన పఠనం పాఠకుడి దృష్టిని వ్యవస్థ బాగోగుల మీదకు మరల్చగలదు. అప్పుడే ప్రజా దృక్పథం పాఠకుడికి అలవడగలదు. పఠన లక్ష్యం నెరవేరగలదు. చివరగా తల్లిదండ్రులందరికీ ఒక మాట విన్నవిస్తున్నాను. సుప్రసిద్ధ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ఉల్లేఖించినట్లుగా ‘పెద్దలు తమ సంతానానికి, వారి ద్వారా సమాజానికి ఇవ్వగల గొప్ప బహుమతులలో ఒకటి పిల్లలకు పఠనం అలవరచడం’ పెంపకంలో భాగం. పిల్లలను చిన్నతనం నుండే పఠనం వైపుకు ప్రోత్సహించాలి.ఎందుకంటే పఠన సామర్థ్యం సమాచార క్రోడీకరణకు, జ్ఞానతృష్ణ హెచ్చింపుకు, సత్యనిర్థారణకు, పాండిత్యాభివృద్ధికి,పరిశోధకులుగా,సృజనాత్మక రచయితలుగా మారడానికి బహుధా ఉపకరిస్తుంది. దీపం అనేక దీపాలను వెలిగించినట్లు, ఒక పుస్తకం అనేక మందిని మేధావులుగా రూపొందించగలదు, విశిష్ట రచనలకు ఎన్నింటికో ప్రాణం పోయగలదు.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News