షియోపూర్ (ఎంపి): మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కు (కెఎన్‌పి)లో వారం రోజుల వ్యవధిలో రెండు మగ చీతాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అటవీ విభాగం అధికారులు వాటిలో అవి కుమ్ములాడుకోవడం వల్లనే చనిపోయాయని అనుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా చీతా సంతతి ప్రాజెక్టు నిర్వాహకులు విన్సెంట్ వాన్‌డెర్ మెర్వ్ సెప్టిసెమియా ఇన్‌ఫెక్షన్ వల్లనే చీతాలు మరణించాయని స్పష్టం చేశారు. చీతాల మెడకు అమర్చిన రేడియో కాలర్లు విపరీతమైన తడి కారణంగా సెప్టిసెమియా ఇన్‌ఫెక్షన్ ముప్పును కలిగించాయని వివరించారు. సెప్టిసెమియా ఇన్‌ఫెక్షన్ అంటే రక్తంలో విషాన్ని వ్యాపింప చేసే అరుదైన వ్యాధి. బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మగచీతా సూరజ్, శుక్రవారం చనిపోగా, మరో చీతా తేజస్ మంగళవారం చనిపోయింది.
ఈ రెండు చీతాలతో కలిపి గత నాలుగు నెలల్లో మొత్తం ఎనిమిది చీతాలు మరణించాయి. దీంతో చీతాల భవిష్యత్తుపై ఆందోళన తలెత్తింది. వీటి మెడపై ఉన్న గాయాలు మరో జంతువులేవీ చేసినవి కావని, ఇన్‌ఫెక్షన్ వల్లనే మెడచుట్టూ గాయాలయ్యాయని విన్సెంట్ చెప్పారు. భారత్‌లో చీతా ప్రాజెక్టు భవిష్యత్తు గురించి అడగ్గా, దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చీతాలను తీసుకురావడంలో తన ప్రయత్నం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 75 శాతం చీతాలు బాగానే ఉన్నాయని, ఇప్పుడు జరిగిన చీతా మరణాలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఏదో ఒక ఇన్‌ఫెక్షన్ వల్లనే ఇవి చనిపోయాయని అనుకున్నామని అయితే చర్యలు తీసుకునే లోపుగానే ఇన్‌ఫెక్షన్ వ్యాపించి వాటిని బలిగొందని మరో అధికారి తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 17 న ఎనిమిది చీతాలను కునో పార్కులో ప్రధాని మోడీ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి కునో పార్కుకు వచ్చాయి. పార్కులో నాలుగు చీతా పిల్లలు పుట్టడంతో మొత్తం వీటి సంఖ్య 24 కు చేరింది. అయితే ఇప్పటివరకు 8 చీతాలు చనిపోవడంతో వీటి సంఖ్య 16 కు పడిపోయింది.