ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. తాజాగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తున్న భారీ వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు నిర్మాతలు.
ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ మనకు దొరికాడు ఇక్కడ. మ్యాడ్ 2 చిత్రంతో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్‌కి అభినందనలు.
‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి. నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సునీల్ సహా అందరు నటులు చక్కగా నవ్వించారు”అని అన్నారు. చిత్ర కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ మ్యాడ్-2 సినిమా పెద్ద హిట్ కావడం ఆనందంగా ఉందని తెలిపారు. చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ “నాగవంశీ లేకపోతే నేను లేను, చినబాబు లేకపోతే మ్యాడ్ లేదు. అలాగే, ఈ సినిమాలో భాగమై ఇంతటి విజయానికి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా థాంక్స్”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర నాగవంశీ, హారిక సూర్యదేవర, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సునీల్, భీమ్స్ సిసిరోలియో, ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్, విష్ణు ఓఐ, సత్యం రాజేష్, కార్తికేయ, ఆంథోనీ రవి, రామ్ ప్రసాద్, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.