Sunday, December 22, 2024

తోటి విద్యార్థులపై బాలుడి కాల్పులు

- Advertisement -
- Advertisement -

బెల్‌గ్రాడ్: ఏడో తరగతి చదువుతున్న ఓ బాలుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. ఇష్టారీతిన కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌కు సమీనంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు..ఆ విద్యార్థి వయసు 12 13 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. హిస్టరీ క్లాస్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆ బాలుడు విద్యార్థులపై కాల్పులు జరిపాడు. వాటిని ఆపేందుకు వచ్చిన సెక్యూరిటీ గార్డుపైనా కాల్పులు జరిపాడు. దాంతో గార్డుతో సహా 9 మంది ప్రాణాలుకోల్పోయారు. కాల్పుల్లో మరో ఆరుగురు విద్యార్థులు, ఒక టీచర్ కూడా గాయపడ్డారని, వారిని ఆస్పత్రిలో చేరారని పోలీసులు తెలిపారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. వారు వెళ్లే సరికి ఆ బాలుడు తుపాకీతో సహా మైదానంలో నిల్చొని ఉన్నాడు. పోలీసులు వెంటనే ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులంతా భయంతో వణికి పోయారు. బాలుడి క్లాస్‌మేట్ ఒకరు మాట్లాడుతూ ‘అతను చాలా నెమ్మదస్తుడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. కానీ మంచి మార్కులు తెచ్చుకుంటాడు’ అని చెప్పారు. కాగా తన కుమార్తె కూడా అదే క్లాసులో చదువుతోందని మిలాన్ మిలోసెవిచ్ అనే అతను చెప్పాడు. కాల్పులు జరిపిన బాలుడు మొదట టీచర్‌పై కాల్పులు జరిపాడని, ఆ తర్వాత భయంతో డెస్క్‌ల కింద నక్కిన విద్యార్థులను కాల్చాడని తన కుమార్తె చెప్పినట్లు ఆయన తెలిపారు.

తన తండ్రికి చెందిన తుపాకీని అపహరించి ఆ బాలుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎంపిక చేసుకున్న విద్యార్థులపై అతను కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వ్లాదిస్లావ్ రిబ్‌నికర్ ప్రైమరీ స్కూల్ బెల్‌గ్రాడ్‌లోని వ్రాచర్ ప్రాంతంలో ఉంది. అదొక సంపన్న ప్రాంతం. అక్కడ దౌత్యకార్యాలయాలు, మ్యూజియాలు ఉన్నాయి. ఈ కాల్పులతో చుట్టుపక్కల పాఠశాలలను కూడా మూసి వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News