Monday, December 23, 2024

కేరళలో పేలుళ్ల కలకలం

- Advertisement -
- Advertisement -

కొచ్చి : కేరళలో ఆదివారం ఉదయం ఓ కన్వెన్షన్ సెంటర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రేయర్ మీట్ (ప్రార్థనల సభ)లో జరిగిన ఈ పేలుళ్లు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, ఆందోళనకు దారితీశాయి. ఘటనలో ఒక్కరు మృతి చెందగా 45 మంది వరకూ గాయపడ్డారు.చనిపోయిన వ్యక్తి మహిళ అని తెలిసింది. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనితో మృతుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. కొచ్చికి కేవలం పదికిలోమీటర్ల దూరంలోని కలమస్సెరిలో ఉన్న జమ్రా కన్వెన్షన్ సెంటర్‌లో జెహోవా క్రిస్టియన్ మత సంబంధిత విట్‌నెసెస్ వర్గం సభ జరిగినప్పుడు , దీనికి దాదాపు రెండువేల మంది హాల్‌లో ఉన్నప్పుడు వరుసగా కనీసం మూడు పేలుళ్లు నిమిషాల వ్యవధిలో ఒకటి తరువాత ఒక్కటిగా పేలాయి. సమూహం మధ్యలో అమర్చిన టిఫిన్ బాక్స్‌లోని బాంబులు పేలినట్లు ప్రాధమిక సాక్షాధారాలతో వెల్లడైంది. అక్కడ దొరికిన టిఫిన్‌బాక్స్‌లో ఐఇడి పరికరాలు కనుగొన్నారు.

పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి సరెండర్
ఘటన తరువాత కొద్ది గంటలకు తానే ఈ పేలుళ్లు జరిపినట్లు డొమినిక్ మార్టిన్ అనే 48 ఏండ్ల వ్యక్తి అంగీకరించినట్లు వెల్లడైంది. ఈ వ్యక్తి కొడకర పోలీసు స్టేషన్‌లో స్వయంగా లొంగిపొయ్యాడు. తాను ఘటనకు పాల్పడినట్లు తెలిపే ఆధారాలను కూడా పోలీసులకు చూపినట్లు, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రార్థనా సభ ఏర్పాటు చేసిన క్రిస్టియన్ వర్గానికే తానూ చెందినవాడినని ఈ వ్యక్తి తెలిపారు. ఈ వ్యక్తి త్రిచూర్‌కు చెందిన వాడని పోలీసులు నిర్థారించారు. ఇజ్రాయెల్ హమాస్ పరస్పర ఘర్షణల నేపథ్యంలో జరిగిన ఈ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ప్రత్యేకించి ఓ మత వర్గం సభలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో దీని వెనుక ఏదైనా ఉగ్రవాద శక్తుల హస్తం ఉందా? ఉంటే పర్యవసనాలేమిటీ ? అనే విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ వెంటనే ఆరా తీస్తోంది. కన్వెషన్ సెంటర్‌లో మధ్యభాగంలో టిఫిన్ బాక్స్ ఉన్నట్లు గుర్తించినట్లు , పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నట్లు కేరళ డిజిపి దార్వేశ్ సాహెబ్ తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న శక్తుల గురించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన డిజిపి దర్యాప్తు తరువాతనే ఏ విషయం అయినా తెలియచేస్తామని వివరించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం సిట్‌ను ఏర్పాటు చేశారు.

సిఎం విజయన్‌కు అమిత్ షా ఫోన్
ఘటనపై వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కేరళ సిఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనా స్థలికి వెంటనే ఎన్‌ఐఎ ఇతర దర్యాప్తు సంస్థలు వెళ్లినట్లు కేరళ మంత్రులు విఎస్ వాసవన్, ఆంటోనీ రాజ్ తెలిపారు. ఘటనకు సంబంధించి పౌరులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని పూర్తి స్థాయిలో శాంతిసంయమనాలు పాటించాలని కేరళ పోలీసు విభాగం ప్రకటన వెలువరించింది. ప్రత్యేకించి సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత లేదా, అవాస్తవిక పోస్టింగ్‌లకు వాటి ప్రచారానికి పాల్పడరాదని, ఎవరైనా ఈ విధంగా చేసినట్లు నిర్థారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కేరళలోని పలు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జనసమ్మర్థ ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో పది మంది వరకూ 50 శాతం వొళ్లుకాలిన గాయాలతో చికిత్సపొందుతున్నారు. 18 మందిని ఐసియూలలో చేర్చి చికిత్స నిర్వహిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి విజయన్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి తెలిపారు.

తొలిపేలుడు తరువాత తరలింపు యత్నాలు
ఇక్కడి కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల క్రిస్టియన్ ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు అయ్యాయి. జెహోవా క్రిస్టియన్ సభల నిర్వాహకులు సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు జనాలను సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేసుకుంటారని కలమస్సెరి ప్రాంత ఎంపి హిబి ఇడెన్ తెలిపారు. ఈసారి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రార్థన జరిగే హాల్ గేట్లకు తాళాలు వేసి ఉండటం, ముందుగా పెద్దగా మంటలు తరువాత దట్టమైన పొగ అలుముకోవడంతో బయటికి తరలించే క్రమంలో తొక్కిసలాట జరిగి ఉంటుందని ఎంపి చెప్పారు. కేరళలో వరుస పేలుళ్ల ఘటన తరువాత దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, ఇతరత్రా సునిశిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక్కడ ఘటనకు బాధ్యుడిగా ప్రకటించుకున్న వ్యక్తి క్రిస్టియన్ మతంలోని జిహోవా విట్‌నెస్సెస్ శాఖకు చెందిన వాడిగా తెలియచేసుకున్నాడు. తమ వర్గం ప్రార్థనా సభలోనే బాంబు ఎందుకు పెట్టినట్లు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది. ఈ వ్యక్తి వాదనపై పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రత్యేక క్రిస్టియన్ గ్రూప్ అమెరికాలో 19వ శతాబ్ధంలో అవతరించింది. కొన్ని క్రిస్టియన్ ఆలోచనలను విశ్వసించే ఆచరించే ఈ వర్గం ప్రపంచ అతి త్వరలో అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉందనే వాదనను విన్పిస్తూ వస్తోంది. యెహోవా సాక్షుల పేరిట తరచూ ప్రార్థనా కూటాలను ఏర్పాటు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News