Sunday, December 22, 2024

సీరియల్ కిల్లర్ కలకలం

- Advertisement -
- Advertisement -

భూములు, డబ్బుల కోసం 20మందికి పైగా హత్య!
సంచలనం సృష్టిస్తోన్న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సత్యం యాదవ్ అఘాయిత్యాలు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ హత్యల పరంపర వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భూములు, డబ్బుల కోసం వరుస హత్యలు చేస్తూ వనపర్తి జిల్లా.. వీపనగండ్ల మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఘట్‌కేసర్ వద్ద హతమార్చిన కేసులో తీగ లాగితే డొంక కదిలిన చందంగా సత్యం యాదవ్ వరుస హత్యల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూజలు నిర్వహించే అమాయకుడిగా నటిస్తూ ఓ జాతీయ రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉంటూ ఈ హత్యల పరంపరను కొనసాగించాడు. విషయం కాస్త బయటపడుతుండడంతో ఆ పార్టీ నుంచి అతనిని సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఈ సీరియల్ కిల్లర్ అమాయకులైన ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని క్షుద్ర పూజలు, డబ్బు ఆశ చూపి వారి నుంచి అందినంత దండుకుని ఆ తర్వాత ఈ విషయం బయటపడకుండా ఒంటి చేతితో హత్యల పరంపరకు తెర దీసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌లో ముస్లిం కుటుంబంలోని చిన్నారి పాపతో సహా ముగ్గురిని హతమార్చిన ఘటనలో కూడా ఇతని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. హత్యకు గురైన కుటుంబానికి పలు ప్రాంతాలలో ప్లాట్లతో పాటు వ్యవసాయ భూములు ఉండడంతో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు ఇవ్వకుండా హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా నాగర్‌కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన ఓ మేస్త్రీని వనపట్ల గేటు సమీపంలో హతమార్చిన ఘటనలో సైతం నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. మేస్త్రీ నుంచి వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు అడగడంతో హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా నాగర్‌కర్నూల్ మండలం.. బొందలపల్లి గ్రామానికి చెందిన తండ్రి కూతురిని సైతం సత్యం యాదవ్ హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరి కుటుంబానికి ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా క్షుద్ర పూజలు చేసిన పిదప భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా అర ఎకర భూమి ఇవ్వడానికి అంగీకరించగా రిజిస్ట్రేషన్ మాత్రం మొత్తం భూమి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న కారణంతో సదరు వృద్ధుడిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ పాడుబడిన దాబాలోని బాత్రూంలో హతమార్చి ముఖంపై యాసిడ్ పోసి దగ్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వీపనగండ్ల మండలానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా ఆ కుటుంబానికి సత్యం యాదవ్‌తో ఏర్పడిన పరిచయంతో వారి ఇంటిలో బంగారం ఉందని క్షుద్ర పూజల ద్వారా బయటకు తీస్తానని నమ్మబలికి వారి నుంచి పది లక్షల రూపాయల దాకా తీసుకున్నట్లు తెలుస్తోంది. పది లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో సదరు వ్యక్తిని ఎవరితో మాట్లాడకుండా, ఇంట్లో వారికి చెప్పకుండా ఘట్‌కేసర్ ప్రాంతానికి రావాలని సత్యం యాదవ్ చెప్పడంతో సదరు వ్యక్తి అనుమానంతో భార్యకు సత్యం యాదవ్ వద్దకు వెళ్తున్నానని చెప్పి వచ్చినట్లు తెలిసింది. తీరా ఘట్‌కేసర్ చేరుకున్న సదరు వ్యక్తి భార్యకు ఫోన్ చేసి తన ఫోన్ స్విచ్ఛాప్ చేస్తున్నానని, మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనని చెప్పినట్లు సమాచారం. క్షుద్ర పూజలకు పురమాయించి పూజలు చేస్తున్న క్రమంలోనే అతనిపై యాసిడ్ పోసి హత్య చేసినట్లు సత్యం యాదవ్‌పై ఆరోపణలు వస్తున్నాయి.

ఈ హత్య ఘటనతో పోలీసులు తీగ లాగితే డొంక కదిలిన చందంగా వరుస హత్యల సంఘటనలు వెలుగుచూశాయి. సత్యం యాదవ్ ఒంటి చేతితో ఈ వరుస హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. ఎవరికీ అనుమానాలు రాకుండా హత్యకు సంబంధించిన ఆనవాళ్లు దొరకకుండా ఇప్పటివరకు పోలీసులు, చట్టం కళ్లు గప్పి వరుస హత్యలకు పాల్పడిన సత్యం యాదవ్ వ్యవహారం ఘట్‌కేసర్ హత్య ఉదంతంతో బయటపడింది. హత్య చేయాలని అనుకున్న వారిని వారి స్వస్థలాలకు దూరంగా జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటించి హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో నాగర్‌కర్నూల్ మండల పరిధిలో గన్యాగుల గ్రామానికి చెందిన మేస్త్రీ హత్య ఘటనలో సత్యం యాదవ్ పాత్ర ఉన్నట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చిన అప్పటి సిఐ ఈ ఘటనపై నిందితుడికే వంత పాడినట్లు ఆరోపణలు వచ్చాయి. సత్యం యాదవ్ అప్పటి సిఐ బంధువుల పేర ఒక ప్లాటును సైతం రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు రావడంతో తిరిగి ఆ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయగా అప్పట్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారి సిఐని బదిలీ చేసే వరకు వెళ్లిందని చెప్పవచ్చు. అప్పుడే లోతైన విచారణ జరిపి సత్యం యాదవ్‌పై చర్యలు తీసుకుని ఉంటే ఇంతమంది బలయ్యేవారు కాదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న సీరియల్ కిల్లర్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. సత్యం యాదవ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పోలీసులను వివరణ కోరగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. మంగళవారం ఎస్‌పి సమక్షంలో సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ కేసు వ్యవహారాన్ని మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా సీరియల్ కిల్లర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News