Thursday, January 23, 2025

నగరంలో వరుసగా హత్యలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా హైదరాబాద్‌లో ఉంటున్న నేరస్థుల్లో మార్పు రావడంలేదు. నేరాలు చేసి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎంతలా మొత్తుకున్నా కూడా వినడం లేదు. చిన్న చిన్న కారణాలను మనసులో పెట్టుకుని తమ స్నేహితులను హత్య చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హత్య ఇటీవలి కాలంలో సాధారణమవుతున్నాయి. పాతబస్తీ దాని పరిసరాల్లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. బహదుర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే హత్యల గురించి ఎంత తక్కువగా చెబుకుంటే అంతమంచిది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో గతకొంత కాలం నుంచి వరసగా హత్యలు జరుగుతున్నాయి. పోలీసుల విచారణలో హత్యకు చిన్న చిన్న తగాదాలు కారణమని తెలుస్తోంది. చిన్న కారణాలను మనసులో పెట్టుకుని హత్యలు చేస్తున్నారు.

ఇటీవల హత్యకు గురైన ఓ యువకుడి కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా కేవలం తమతో మద్యం తాగి తిడుతున్నాడని హత్య చేశారు. ముగ్గురు యువకులు కలిసి కల్లు కాంపౌండ్‌లో రోజు కల్తు తాగే వారు, తర్వాత మద్యం తాగే వారు వారిలో ఒకరు మద్యం తాగిన తర్వాత వారిని డబ్బులు అడిగేవాడు. తనకు వారు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో భూతులు తిట్టేవాడు. వాటిని మనసులో పెట్టుకున్న మిగతా ఇద్దరు మద్యం తాగిన తర్వాత కత్తులతో పొడిచి చంపేశారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన మూడు హత్యల్లో సైకోను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రవీణ్ పాతనేరస్థుడు జైలు నుంచి ఫిబ్రవరిలో విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని హత్యలు చేస్తున్నాడు. ప్రవీణ్ గతంలో కూడా ముగ్గురిని డబ్బుల కోసం హత్య చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

వచ్చిన తర్వాత ఏ మాత్రం మారకుండా మళ్లీ హత్యలు చేయడం ప్రారంభించాడు. తనకు డబ్బులు అవసరం ఉండడంతో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారి వద్ద పడుకున్నట్లు నటించి వారు గాఢ నిద్రలోకి జారుకోగానే హత్య చేసి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని పారిపోతున్నాడు. నిందితుడి వల్ల ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అమాయకులు హత్యకు గురయ్యారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో బుధవారం వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. టపాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను బుధవారం హత్య చేశారు. అలాగే ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు కుట్రపన్నిన వారిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. గత ఏప్రిల్ నెలలో కార్వాన్‌కు చెందిన బిజేపి నాయకుడు అమర్‌సింగ్ మేనల్లుడిని దసరా రోజు గొడవ పెట్టుకున్నాడని ప్రత్యార్థులు రాజీకి పిలిచి ఇంట్లోనే హత్య చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు ఏకంగా బీహార్ నుంచి తుపాకీని కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు. ఈ హత్యలో కత్తులతో పొడవడమే కాకుండా తుపాకీతో కూడా కాల్చిచంపారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వరుసగా పాతబస్తీలో హత్యలు జరిగాయి. తర్వాత ఇటీవలి కాలంలో ఎక్కువగా మళ్లీ హత్యలు వరుసగా నగరంలో జరుగుతున్నాయి. వివిధ కారణాలు చెప్పి కత్తులతో దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. కాగా, బాధితులు అందరూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారే ఉన్నారు.
మార్పు రావడంలేదు…
వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా కూడా నేరస్థుల్లో మార్పు రావడంలేదు. జైలుకు వెళ్లిన వారిలో అక్కడ మార్పుతీసుకుని వచ్చి మళ్లీ నేరాలు చేయకుండా చేయాలనేది లక్షం. కాని జైలుకు వచ్చిన తర్వాత కూడా నేరస్థుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు, జైలులో వారికి ఎలాంటి కౌన్సెలింగ్ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీ కేంద్రంగా ఇన్ని హత్యలు గతంలో ఇప్పుడు జరుగుతున్నా పోలీసులు పటిష్ట నిఘా పెట్టలేకపోతున్నారు. నేరస్థులపై నిఘా పెట్టడంలేదు, మార్పు తీసుకుని వచ్చేందుకు ఏమాత్రం ప్రతయ్నం చేయడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక నేరస్థుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అతడి ప్రవర్తనపై స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలి, మళ్లీ అతడు నేరం చేసే అవకాశం ఉందాలేదా అనే విషయం ఎప్పటికప్పుడు సేకరించాలి. ఒకవేళా నేరం చేసేందుకు ప్రయత్నం చేస్తే వెంటనే అడ్డుకోవాలి.కానీ ఇవిఏవి ప్రస్తుతం అమలు కావడంలేదు,దీంతో జైలు నుంచి వచ్చిన తర్వాత నేరస్థులు మళ్లీ హత్యలు చేస్తున్నారు. కార్డన్ సెర్చ్‌ను కూడా మర్చిపోయారు, కరోనాకు ముందు పోలీసులు తరచూ పాతబస్తీలో కార్డన్ సెర్చ్ చేసేవారు. ఇప్పుడు కార్డన్ సెర్చ్ చేయడం మర్చిపోయారు, దీంతో రౌడీలు తాము చేయాల్సిన పనులను చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News