లెక్కలు తీయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమ లే ఔట్ల లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2018లో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ప్రస్తుతం రియల్ భూమ్ ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల తరువాత ధరలు మరింతగా పెరగనుండంతో అక్రమ లే ఔట్ల వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. దీంతో రియల్ వ్యాపారులు అక్రమ లే ఔట్లకు సంబంధించిన కొత్త పంథాను ఎంచుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వ భూములకు సైతం రక్షణ లేకపోవడంతో వాటిని కూడా తమ వెంచర్లలో కలుపుకొని రియల్ వ్యాపారులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల జరగడంతో అక్రమ లే ఔట్ల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది.
ఔటర్ లోపల ఉన్న గ్రామాలు ప్రస్తుతం మున్సిపాలిటీలుగా…
ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాదారులు మాయం చేస్తున్నారు. పార్కుస్థలాలతో పాటు దేవాదాయ భూములను కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు. వారు చేసిన అక్రమ వెంచర్లలో ఆ భూములను కలుపుకొని వాటిని విక్రయిస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల భూములు అన్యాక్రాంతం కాగా, మరికొన్ని చోట్ల కబ్జాదారులు అక్రమ కట్టడాలు నిర్మిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంగా విస్తరించడంతో హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాలు అందులో విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలన్నీ ప్రస్తుతం మున్సిపాలిటీలుగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా పట్టణీకరణ జరిగేందుకు హైదరాబాద్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఈ సమయంలోనే కబ్జాదారులు అక్రమ లే ఔట్లను చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
22 మున్సిపాలిటీలు, ఏడు నగర పాలక సంస్థలు
హైదరాబాద్ మహానగరం చుట్టూ 22 మున్సిపాలిటీలు, ఏడు నగర పాలక సంస్థలు ఉన్నాయి. రాజధాని పరిధిలో భూములు కొనుగోలు చేయాలనుకునే వారు దాదాపుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని స్థలాలనే కొనుగోలు చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులు మున్సిపాలిటీల పరిధిలో లే ఔట్లు చేస్తున్నా, వాటిల్లో విడిచిపెట్టే సామాజిక అవసరాల స్థలాన్ని స్థానిక సంస్థలకు రిజిస్ట్రర్ చేయడం లేదు. లే ఔట్ విస్తీర్ణంలో పది శాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం కేటాయించాలి. ఆ స్థలంలో ఉద్యానవనాలు, సామాజిక భవనాలు తదితర వసతులు ఏర్పాటు చేయాలి. లే ఔట్ పూర్తయిన వెంటనే ఆ స్థలాన్ని సంబంధిత మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రర్ చేయాలి. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో స్థిరాస్తి వ్యాపారులకు కలిసివస్తోంది. సామాజిక అవసరాల కోసం విడిచిపెట్టిన స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలం హాంఫట్
అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో చాలా ఏళ్లుగా రియల్ వ్యాపారులు అడ్డగోలుగా లే ఔట్లలోని సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు యథేచ్ఛగా విక్రయించుకుంటున్నారు. వాటిని తెలియక కొనుగోలు చేసి అమాయకులు మోసపోతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అక్రమ లే ఔట్లతో పాటు మున్సిపాలిటీల వారీగా సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలను లెక్కలు తీయాలని సంబంధిత అధికారులను సిఎం ఆదేశించినట్టుగా తెలిసింది.
పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో….
పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని భూములకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో అక్కడే ఎక్కువగా కబ్జాలకు గురవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా ఉత్తరం వైపు ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటి కారిడార్ ఉండడం వల్లే ఇటువైపు పెద్దమొత్తంలో భూములకు, ఇళ్లకు, ఆఫీసు స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఐటి కారిడార్ సమీపంలో ఉన్న మణికొండ, పుప్పాల్‌గూడ, నార్సింగి, కోకాపేట, మంచిరేవుల, బండ్లగూడ, కిస్మత్‌పూర్, పీరంచెరువు, బైరాగిగూడ, గోపన్‌పల్లి ప్రాంతాలు ఔటర్ లోపలే ఉండడంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్ ఉంది. ఇక్కడ గతంలో పంచాయతీల పాలన ఉండడంతో పాత లే ఔట్ల ఆధారంగా అనుమతి పత్రాలు సృష్టిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
పార్కు స్థలాల్లో భారీ భవనాలు
పంచాయతీలుగా ఉన్నప్పుడే మొదలు..భూములు స్థానిక సంస్థల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడం పెద్ద సవాలుగా మారనుంది. ఇప్పటికే పూర్తయిన లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు దాదాపుగా ఆక్రమణ కోరల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా కోకాపేట, పుప్పాలగూడ, మణికొండ, బండ్లగూడ, నార్సింగి, నిజాంపేట ప్రాంతాల్లో పార్కు స్థలాల్లో భారీ భవనాలు పుట్టుకొచ్చాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకున్న పరిస్థితి లేదు. వీటిని తిరిగి స్వాధీనం చేసుకుని మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం కష్టంగా మారనుంది. దీనికితోడు రెండేళ్ల కిందటే శివారుల్లో మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. అంతకుముందు గ్రామ పంచాయతీల పేరిట అనుమతులు తీసుకొని సర్పంచులతో కుమ్మక్కై లే ఔట్ స్థలాలను విక్రయించారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వీటి లెక్కలు తీసే పనిలో అధికారులు ఉన్నారు.