న్యూఢిల్లీ : కరోనాకు అడ్డుకట్ట వేసేలా కొవొవాక్స్ టీకాను బూస్టర్‌గా వినియోగించడానికి వీలుగా మూడోదశ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిసీజీఐ ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ) అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఇప్పటికే కంపెనీ ఉత్పత్తి చేసిన టీకాను అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కోసం డిసిజిఐ డిసెంబర్ 28న అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ టీకాను జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలో చేర్చలేదు.
కొవొవాక్స్ బూస్టర్ డోస్‌గా ఇవ్వడానికి భద్రత, ఇమ్యునోజెనిసిటీని అంచనా వేసేందుకు మూడో దశ ట్రయల్స్ కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్‌సింగ్ గతవారం దరఖాస్తు చేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మూడు నెలల కిందట కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారిపై ఇప్పుడు మూడోదశ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులకు బూస్టర్ డోసులు ఇస్తున్నాయని, ప్రకాశ్ కుమార్‌సింగ్ తన దరఖాస్తులో పేర్కొన్నారని అధికార వర్గాలు వివరించాయి.
ఇప్పుడు మూడోదశ ట్రయల్స్‌కు అనుమతిస్తే మనదేశ ప్రజలకు బూస్టర్ డోసుగా కొవొవాక్స్ వీలైనంత వేగంగా అందుబాటు లోకి వస్తుందని దరఖాస్తులో అభ్యర్థించినట్టు అధికారవర్గాలు వివరించాయి. సంస్థ సిఇఒ అదర్ సి పూనావాలా నేతృత్వంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగే ప్రాణాధార వ్యాక్సిన్లను అందుబాటు ధరలకు అందించడానికి కట్టుబడి ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు.