Monday, December 23, 2024

మొరాయిస్తున్న సర్వర్లు…అందని సర్టిఫికెట్లు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని బండ్లగూడ మండల కార్యాలయంలో వివిధ ధృవపత్రాల కోసం దరఖాస్తు చేసుకు న్న దరఖాస్తుదారులకు సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోం ది. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తిదారులకు లక్ష రూపాయల పూర్తి సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మండల కార్యాలయానికి ఒక్కసారిగా దరఖాస్తుల తాకిడి పెరిగింది. నివాస, కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం విశ్వబ్రాహ్మణులు, నాయిబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూజల తదితర కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న బీసీ, ఎంబీసీలు మీసేవ ద్వారా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.లక్ష పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ చివరి గడువు కావటంతో అర్హులైన వారు మీసేవలకు, మండల కార్యాలయాలకు క్యూ కట్టారు.

అయితే మండల కార్యాలయాలలోని సర్వర్లు మొరాయిస్తూ సిబ్బందికి, దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో తహశీల్ సిబ్బంది దరఖాస్తుదారుల వత్తిడితో తలలు పట్టుకుంటున్నారు. ఎం చెప్పాలో, ఎం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాత్రింబవళ్లు మండల కార్యాలయంలో తిష్టవేసి సర్టిఫికెట్ల తయ్యారీలో నిమగ్నమైయ్యారు. అయితే సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దరఖాస్తుదారులు మాత్రం సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

కొన్ని సందర్భాలలో మండల సిబ్బందికి వారికి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. పైరవీకారులకు, మీసేవ నిర్వాహకులకు మాత్రమే త్వరగా సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని సర్వర్ సమస్యను పరిష్కరించాలనే విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. గడువు దగ్గర పడినందున ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో దరఖాస్తు చివరి తేదీని పొడగించాలని కోరుతున్నారు. కాగా ఈ విషయమై వివరణ కోసం ‘మనతెలంగాణ’ ప్రయత్నించగా, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్డార్ల స్పందన కరువైయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News