Monday, December 23, 2024

ఆర్‌టిఒ కార్యాలయానికి వెళ్లే పనిలేదు..

- Advertisement -
- Advertisement -

58 సేవలు ఇక ఆన్ లైన్ లోనే…

మన తెలంగాణ/హైదరాబాద్ : వాహనాలకు సంబంధించిన సేవలు సులభతరం కానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఇకపై ఆన్‌లైన్ వేదికగానే పొందే సదుపాయాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆధార్ అథంటికేషన్ ఆధారంగా మొత్తం 58 పౌర సంబంధిత సేవలను ఆన్‌లైన్ ద్వారా ఇకపై పొందొచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆధార్ వినియోగం స్వచ్ఛందమేనని అందులో పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి.. లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, కండక్టర్ లైసెన్స్‌లో అడ్రస్ మార్పు, వాహన ఓనర్‌షిప్ మార్పు వంటి సేవలూ ఆన్‌లైన్‌లో లభిస్తాయని తెలిపింది. ఈ సేవలన్నీ ఆధార్ అథెంటికేషన్ ద్వారా పొందొచ్చని పేర్కొంది. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మాత్రం భౌతికంగా హాజరు కావాల్సిందేనని తెలిపింది. ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కార్యాలయానికి వెళ్లే అవసరం ఉండదని రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. దీనివల్ల ఆర్‌టిఒ కార్యాలయంపైనా భారం తగ్గుతుందని అభిప్రాయపడింది. తద్వారా ఇతర సేవలు సులభంగా లభ్యమవుతాయని పేర్కొంది. ఆధార్ నంబర్ లేని వారు భౌతికంగా కార్యాలయానికి హాజరై సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News