ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధరకు మద్యం కలిపి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను లింగంపల్లి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. తక్కువ ధరలు ఉన్న మద్యాన్ని నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బార్‌లో నుంచి రూ.1.48లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి అయ్యప్ప సొసైటీలో ఉన్న ట్రూప్ బార్ యాజమాన్యం లైసెన్స్ ఫీజ్ చెల్లించకుండానే నడుపుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో మద్యం డిపోల నుంచి మద్యం కొనుగోలు చేయడంలేదు. దీంతో అనుమానం వచ్చిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ట్రూప్‌బార్‌పై దాడి చేశారు. ఈ సమయంలోనే బార్‌లో కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్ ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి తక్కువ ధర కలిగిన మద్యం, నీళ్లు కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రూ. 2,690 ధర ఉన్న జెమ్‌సన్ బాటిళ్లల్లో రూ.1000 ఉన్న ఓక్స్‌స్మీత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు. స్థానికంగా ఉన్న మద్యం దుకాణాల్లో మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఎక్కువ ధరలు కలిగిన బాటిళ్లలో తక్కువ ధర ఉన్న మద్యాన్ని కలుపుతూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో బయటపడింది. బార్ లైసన్స్ ఓనర్ ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి, బార్‌లో పని చేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్ పై కేసు నమోదు చేసి లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. బార్ రెన్యూవల్ ఫీజు కూడా చెల్లించలేదని తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుభాష్ చందర్‌రావు. ఎస్సై వెంకటేశ్వర్లు, అఖిల్, కానిస్టేబుళ్లు సుధాకర్, కిషన్, శ్రీనివాస్, సుదీప్ రెడ్డి, పెంటారెడ్డి, దుర్గ శ్యామ్ ప్రసాద్ ఉన్నారు.