డిజిసిఎకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : విమానాల పైలట్లకు, సిబ్బందికి తమ విధులకు ముందుగా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ తప్పనిసరిగా అవసరమా లేక ప్రత్యామ్నాయంగా రక్త పరీక్షలు సరిపోతాయా అన్నది నిర్ధారించడానికి వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పౌర విమానయాన నిర్వహణ సంస్థ డిజిసిఎను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విమాన పైలట్లు, ఇతర సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు తప్పనిసరి అని డిజిసిఎ నిర్ణయించడంపై ఎయిర్ ఇండియా పైలట్ల అసోసియేషన్ ఆ పరీక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది.
డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో ఉంటున్న పది శాతం విమాన సిబ్బందికి విధులకు ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలని నిర్ణయించినట్టు నమూనా ఉత్తర్వు డిజిసిఎ ఏప్రిల్ 27న జారీ చేయడంపై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మే 5న తదుపరి విచారణ నాటికి ఆ కమిటీ తన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈలోగా బుధవారం నుంచి అమలు కానున్న కొత్త నిబంధనలను డిజిసిఎ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. ఎయిర్ ఇండియా పైలట్ల అసోసియేషన్ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఆపాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది.