Friday, November 22, 2024

ఉప ఎన్నికల్లో కమలానికి ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

Setback for BJP in by-elections 2021

బెంగాల్‌లో టిఎంసి, హిమాచల్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్
పరువు నిలబెట్టిన అసోం, మధ్యప్రదేశ్
కర్నాటకలో మిశ్రమ ఫలితాలు
మండి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, ఖాండ్వాలో బిజెపి గెలుపు
దాద్రా, నాగర్ హవేలి శివసేన కైవసం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కొన్ని చోట్ల ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బిజెపి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలుపొందింది. తృణమూల్ కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ప్రాంతీయ పార్టీలు మిగతా స్థానాల్లో గెలుపొందాయి. అంతేకాదు ఉప ఎన్నికలు జరిగిన మూడు లోక్‌సభ స్థానాల్లో బిజెపి ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయగా, పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లోను తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. అక్కడ ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల బిజెపికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించడానికి ముందే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రకటించడంతో పాటు తమ పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా బిజెపికి గట్టి పట్టు ఉన్న దిన్‌హటా నియోజకవర్గం దీదీ పార్టీ వశమయింది. అక్కడ టిఎంసి లక్షన్నర ఓట్ల మెజారిటీ సాధించింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి నిశిత్ ప్రామాణిక్ దిన్‌మటానుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మంగళవారం ఫలితాలు వెలువడగా దిన్‌హటాలో తృణమూల్ అభ్యర్థి ఉదయన్ గుహా బిజెపి అభ్యర్థి అశోక్ మండల్‌పై లక్షా 64 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. గోసాబా నియోజకవర్గంలోనూ టిఎంసి అభ్యర్థి సుబ్రతా మండల్ 1.41 లక్షల మెజారిటీతో గెలుపొందారు. శాంతిపూర్, ఖర్దాహ్‌లలోనూ టిఎంసి ఘన విజయం సాధించింది. ఈ నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో టిఎంసి బలం 215కు పెరగ్గా బిజెపి బలం ఇంతకు ముందున్న 77నుంచి 75కు పడిపోయింది.

హిమాచల్‌లో బిజెపికి కాంగ్రెస్ షాక్

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కాషాయ పార్టీకి షాక్ తగిలింది. మండి లోక్‌సభ స్థానంతో పాటు ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లోను కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మండి లోక్‌సభ స్థానంలో బిజెపి ఎంపి రామ్‌స్వరూప్ శర్మ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ పోటీ చేయగా, బిజెపి తరఫున కార్గిల్ వీరుడు బ్రిగేడియర్ కుషాల్ సింగ్ పోటీ చేశారు. మంగళవారం వెలవడిన ఫలితాల్లో ప్రతిభా సింగ్ విజయం సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాంఠాకూర్ సొంత జిల్లా అయిన మండీలో బిజెపికి ఇది గట్టి ఎదురుదెబ్బే. ఇక ఇదే రాష్ట్రంలోని ఫతేపూర్, అర్కి, జుబ్బల్ కొట్కాయ్ అసెంబ్లీ నియోజక వర్గాలకూ ఉప ఎన్నికలు జరగ్గా మూడింటా కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగుర వేశారు.

కర్నాటకలో మిశ్రమ ఫలితాలు

కర్నాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. సిండ్గీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రమేశ్ భుసనూర్ ్కంగ్రెస్ ప్రత్యర్థి అశోక్ మనగుడిపై 31 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించాడు. అయితే హంగల్ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మాణె బిజెపి అభ్యర్థి శివరాజ్ సజ్జనార్‌పై 7,373ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. హంగల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరి పరిధిలో ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన బిజెపి నేత ఉడసి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మధ్యప్రదేశ్‌లో కమలం హవా

మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా లోక్‌సభ స్థానానికి, మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఖాండ్వా లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి జానేశ్వర్ పాటిల్ చివరి వార్తలు అందే సమయానికి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి రాజ్‌నారాయన్ సింగ్ పుర్నిపై దాదాపు 80 వేల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఇక ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లో జోబట్( ఎస్‌టి) స్థానాన్ని కాంగ్రెస్‌నుంచి బిజెపి హస్తగతం చేసుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి సులోచన రావత్ తన సమీప ప్రత్యర్థి మహేశ్ పాటిల్‌పై 6,104 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.పృథ్వీపూర్ నయోజకవర్గంలో కూడా బిజెపి అభ్యర్థి శిశుపాల్ సింగ్ యాదవ్ కాంగ్రెస్ ప్రత్యర్థి నితేంద్ర సింగ్ రాథోడ్‌పై ఆధిక్యతలో ఉండగా, రాయ్‌గావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కల్పనా వర విజయం దిశగా దూసుకెళ్తున్నారు. రాజస్థాన్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లోను అధికార కాంగ్రెస్ గెలుపొందింది. ఇంతకు ముందు బిజెపి ప్రాతినిధ్యం వహించిన ధరియావాడ్ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజ్ మీనా 18 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

వల్లభ్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రీతి షక్తావత్ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ అభ్యర్థి ఉదయ్‌లాల్ దంగిపై 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లోను బిజెపి మూడు, నాలుగో స్థానాల్లో నిలవడం గమనార్హం. హర్యానాలోని ఎల్లెనాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఉప ఎన్నికలో ఐఎన్‌ఎల్‌డి నేత అభయ్ సింగ్ చౌతాలా బిజెపికి చెందిన గోబింద్ కందాపై 6,700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కేంద్రప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అభయ్‌సింగ్ చౌతాలా తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అవసరమైంది. బీహార్‌లో కుశేశ్వర్ ఆస్థాన్ రిజర్వ్‌డ్ స్థానాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జెడి(యు) నిలబెట్టుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి అమన్‌సింగ్ భూషణ్ హజారి ఆర్‌జెడి అభ్యర్థి గణేశ్ భారతిపై 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా ఉప ఎన్నిక జరిగిన మరో నియోజకవర్గం తానాపూర్‌లో ఆర్‌జెడి అభ్యర్థి అరుణ్ కుమార్ సాహా 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 2 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతున్నారు. తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి గెలుచుకోగా, ఎపిలోని బద్వేల్ స్థానంలో అధికార వైసిసి భారీ మెజారిటీతో గెలుపొందింది.

దాద్రా, నాగర్ హవేలిలో శివసేన

దాద్రా, నాగర్ హవేలి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి కాలాబెన్ దేల్కర్ బిజెపి ప్రత్యర్థి మహేశ్ గవిట్‌పై 51,269 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మాజీ ఎంపి మోహన్ దేల్కర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన సతీమణి కాలాబెన్ దేల్కర్‌ను శివసేన బరిలోకి దింపింది.

అసోంలో బిజెపి కూటమి క్లీన్‌స్వీప్

అసోం రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బిజెపి నేతృత్వంలోని అధికార కూటమి అన్ని స్థానాల్లో జయ కేతనం ఎగురవేసిది. భవానీపూర్, మరియాని, తౌరా స్థానాల్లో బిజెపి అభ్యర్థులు గెలుపొందగా దాని మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్‌స పార్టీ లిబరల్( యుపిపిఎల్) మిగతా రెండు స్థానాలు గోస్సాయ్ గావ్, తముల్‌పూర్‌లలో గెలుపొందింది. ఇక మేఘాలయలో ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలను నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని అధికార మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్ గెలుచుకుంది. ఎన్‌పిపి రాజ్‌బాల, మారింగ్ కెంగ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీనుంచి చేజిక్కించుకోగా, దాని మిత్రపక్షమైన యుడిపి మావ్‌ప్తంగ్ స్థానంనుంచి గెలుపొందింది. మిజోరాంలో ఉప ఎన్నిక జరిగిన ఏకైక స్థానం తూరియాల్‌లో మిజో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News