హైదరాబాద్ : సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే మహేశ్ బాబుతో కొరటాల శివ తెరకెక్కించిన ’శ్రీమంతుడు’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో, నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును కొరటాల శివ ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను హైకోర్టుకు శరత్ చంద్ర అందజేశారు. శరత్ చంద్ర ఆధారాలను సమర్థిస్తూ రచయితల సంఘం కూడా హైకోర్టుకు నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో, కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొరటాల పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.