శివాజీ విగ్రహం
ఏర్పాటుపై ఉద్రిక్తత
రెండు వర్గాల మధ్య
ఘర్షణ పోలీసులపై
రాళ్లు, లాఠీఛార్జి,
బాష్పవాయువు
ప్రయోగం
అదుపులో
: హోం మంత్రితో డిజిపి
మన తెలంగాణ/బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం రాత్రి విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ వర్గానికి చెం దిన వారు
శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో మరోవర్గం వారు విగ్రహం ఏర్పాటుకు అనుమతిలేదంటూ ఆదివారం ఆందోళన చేశారు. దీంతో ఇరువర్గాల ఆందోళనలతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐజి నాగిరెడ్డి, డిఐజి కమలాసన్ రెడ్డి బోధన్‌లో పర్యటించారు. శివాజీ విగ్రహ ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించి, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మధ్య ఘర్షణలు తలెత్తాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గతంలోనే తీర్మానించారని, ఆ ప్రకారమే ఏర్పాటు చేశామని ఒక వర్గం చెబుతుండగా.. ససేమిరా కుదరదంటూ మరో వర్గం వాదనకు దిగి, విగ్రహాన్ని తొలగించాల్సిందేనని పట్టుబట్టారు.
ఈ పరిస్థితుల్లో ఇరువర్గాలు రోడ్డుపై పోటీపోటీగా భీష్మించుకుని కూర్చోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండువర్గాలు బాహాబాహీకి దిగడంతోపాటు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశంచేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాంతో ఓ వర్గం వారు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో లాఠీచార్జి చేశారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదే సందర్భంలో ఇరువర్గాలు ఏర్పాటుచేసిన టెంట్లను సైతం తొలగించి ఆందోళనకారులను పోలీసులు తరిమివేశారు. కాగా, ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలో 144 సెక్షన్ విధించారు. పట్టణంలో ఉదయం నుంచి ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంతకుముందు పట్టణ ఎస్‌హెచ్‌ఓ ప్రేంకుమార్ పోలీస్ బృందంతో ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో లాఠీచార్జి చేశారు. కాగా, విషయం తెలుసుకుని బోధన్‌కు చేరుకున్న నిజామాబాద్ సిపి కెఆర్ నాగరాజు స్థానికంగా ఉన్న పరిస్థితిపై సమీక్షించారు. బైట వ్యక్తులు ఎవ్వరూ పట్టణంలోకి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.విగ్రహం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కాగా, ఆందోళనకు దిగిన ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకుని పలువురిపై కేసులు నమోదుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, పరిస్థితిని నిజామాబాద్, కామారెడ్డి సిపిలు పర్యవేక్షించారు.
నేడు బోధన్ బంద్‌కు బిజెపి పిలుపు
సోమవారం బోధన్ బంద్‌కు బిజెపి పిలుపునిచ్చింది. బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులను కోరారు. బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు.. రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీయడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కాగా, పట్టణంలో పోలీసులు భారీగా మోహరించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘బోధన్’లో అదుపులోనే పరిస్థితి
హోంమంత్రికి డిజిపి వివరణ
బోధన్ సంఘటనపై రాష్ట్ర పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈక్రమంలో బోధన్ పరిస్థితులపై డిజిపి ఎం మహేందర్ రెడ్డి, నిజామాబాద్ కమీషనర్ కె.ఆర్ నాగరాజులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ప్రస్తుతం బోధన్‌లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, కమిషనర్ నాగరాజు ఇతర పోలీసు అధికారులు బోధన్‌లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారన్నారని ఈ సందర్భంగా డిజిపి మహేందర్‌రెడ్డి హోం మంత్రికి వివరించారు. బోధన్‌లో ఉద్రిక్తత లకు దారి తీసిన పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరించాలని హోం మంత్రి డిజిపికి ఆదేశాలిచ్చారు. దీంతో బోధన్‌లో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేశామని డిజిపి హోం మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యత కల్పిస్తూ సెక్యులర్ నాయకుడుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉందని హోం మంత్రి పేర్కొన్నారు. బోధన్‌లో పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉన్నారని, స్థానిక ప్రజలు పోలీసులకు సహకరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.