బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంత సంచరిస్తూ బంజారాలకు హితబోధ చేసిన మహోన్నతమైన వ్యక్తి ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్’. యావత్ భారత దేశం అంతా సంచరిస్తూ ఉప్పు అమ్ముకుంటూ, ఆవులను మేపుకుంటూ దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ మహారాజ్ ఏకం చేశారు. స్థిరనివాసం ఆవశ్యకతను తెలిపి, బంజారా జాతిని మూఢనమ్మకాల నుండి హింసా, మద్యపానం మొదలగు వ్యసనాలకు బానిసకాకుండా స్వచ్ఛమైన జీవనం కొనసాగించాలని బంజారాల గురువు ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్’ హితోపదేశం చేశారు. ఈయన జయంతిని బంజారాలు ఒక పండుగలా జరుపుకుంటారు.
బంజారాలకు దశ దిశ చూపి, వారి ఆచార వ్యవహారాల గొప్పదనం, విశిష్టతలను తెలియజేయడానికే సేవాలాల్ మహరాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని రాంజీ నాయక్ తండాలో జన్మించారు. తండ్రి భీమనాయక్ తల్లి ధర్మిణిబాయి. పెరిగి పెద్దవాడైన సేవాలాల్ ఆవులను కాస్తూ అడవిలో దొరికే బంకమట్టితో రొట్టెలు చేసి తినేవారు. ఈ విచిత్ర ప్రవర్తన తలితండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ హింస పాపమని, మత్తు, ధూమపానం శాపం అని, ఎప్పుడు సత్యమే పలకాలని తన తెల్లటి గుర్రం తోళారాంపై తిరుగుతూ ప్రబోధించేవారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలిని, దాహంతో ఉన్నవాడికి మంచి నీళ్ళు తాగించాలని, దారి తప్పిపోయి ఆగమవుతున్న వారికి మంచి మార్గం చూపించాలని, సహాయం కోరిన వారికి అండగా ఉండాలని, ఏడుస్తూ కూర్చుంటే ఉన్నతులు కాలేరని ఎన్నో జీవిత సత్యాలను తెలియచేశారు.
అలాగే భవిష్యత్తులో జరగబోయే విషయాలు పోతులూరి వీరబ్రహ్మమ్ కాలజ్ఞానం లాగా క్షణంలోనే మన మాటలు ఏ ఖండాంతరాలకైన చేరిపోతాయిని, నీళ్ళను సహితం డబ్బులతో కొనాల్సిన రోజు వస్తుందని, ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయిని నేడు మన అనుభవంలో ఉన్న సెల్ఫోన్, నీళ్ళ పరిస్థితిని, వాహానాలను గురించి ఆనాడే చెప్పారు. సేవాలాల్ మహిమలపైన అనేక కథనాలు కలవు. దేశంలో బంజారాల జనాభా సుమారు పది కోట్లు. వీరి ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ మహారాజ్ జీవితం బంజారాలకే కాక యావత్ సమాజానికి ఆదర్శప్రాయం. కాబట్టి వీరి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. దేశమంతా వీరి జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి ఘనంగా జయంతోత్సవాలు నిర్వహించాలి.
భూక్యా రాజారాం నాయక్
9949219961