హత్య జరిగిన 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర వవార్ వెల్లడి
హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్, కారు, ఆయుధాల స్వాధీనం
మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ కౌన్సిలర్ బానోతు రవినాయక్ హత్య కేసును ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఇద్దరు ప్రధాన నిందితులతోపాటు హత్యకు సహకరించిన మరో ఐదుగురితో సహా మొత్తం ఏడుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి వివరాలను టౌన్ పోలీసుస్టేషన్‌లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. కౌన్సిలర్ రవినాయక్ గతంలో నల్ల బెల్లం వ్యాపారంలో మంగళి కాలనీకి చెందిన భూక్య విజయ్, బాబునాయక్ తండాకు చెందిన భూక్య అరుణ్‌లు సహకరించేవారు. తర్వాత కాలంలో వారు విడిగా వ్యాపారాలు చేసుకోవడంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగా వారు తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్న రవినాయక్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చి, గొడ్డలి, కత్తిని తయారు చేయించి విజయ్ ఇంట్లో ఉంచారని ఎస్పి చెప్పారు. మొదటి కారుతో రవిని గుద్ది చంపాలని.. ఆ క్రమంలో అతను చనిపోకపోతే గొడ్డలి, కత్తితో నరకాలని పథకం రచించారని తెలిపారు.
ఈ మేరకు రవిని హత్య చేసేందుకు మూడు రోజులపాటు ప్రయత్నించారని, కానీ, సమయానికి రవి అచూకీ లేకపోవడంతో రవి సమాచారం కోసం మంగళికాలనీకి చెందిన స్నేహితులైన గుగులోతు చింటూ అలియాస్ సతీష్, కారపాటి సుమంత్ అజ్మీరా కుమార్, గుగులోతు బావుసింగ్‌ను ఆరా తీయమని పురమాయించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఈనెల 20న పెళ్లి కోసమని ఓ కారును మూడు రోజులకుగానూ అద్దెకు తీసుకున్నారన్నారు. కారులో గురువారం ఉదయం నుంచే రవినాయక్ కోసం గాలిస్తూ తిరిగారని తెలిపారు. ఎప్పటికప్పుడు రవినాయక్ సమాచారం సేకరిస్తూనే అనువైన సమయంకోసం వేచిచూడగా.. రవి ఒంటరిగా దొరకకపోవడంతో విజయ్, బాలరాజులు వారి ఇళ్లకు వెళ్లగా అరుణ్ మాత్రం మహబూబాబాద్ టౌన్‌లో కారులో చక్కర్లు కొతుడూ రవి కోసం వేతికే పనిలో పడ్డారని ఎస్పి తెలిపారు. కాగా, గురువారం ఉదయం 11.30గంటల సమయంలో రవినాయక్ బైక్‌పై ఒంటరిగా పత్తిపాక వైపు వెళుతుండడం చూసిన అరుణ్ అతన్ని కారులో ఫాలో అవుతూ విజయ్‌కు సమాచారం అందించాడన్నారు.
విజయ్ తన ట్రాక్టర్‌ను నడుపుతూ రవికి ఎదురుగా వస్తూ పత్తిపాకలోని మిలటరీ శ్రీను ఇంటి సమీపంలో స్పీడ్‌గా ట్రాక్టర్‌ను నడిపి రవిని ఢీకొన్నట్టు ఎస్పి తెలిపారు. దాంతో రవి కింద పడిపోగా విజయ్ ట్రాక్టర్ దిగి అప్పటికే అక్కడికి చేరుకున్న కారులో పెట్టిన కత్తిని తీసుకోగా, విజయ్ గొడ్డలిని తీసుకుని రవి తలపై గొడ్డలితో పలుమార్లు నరకగా, అరుణ్ కత్తితో పొడవగా బలమైన గాయాలై తీవ్రరక్తస్రావం అయ్యి రవి రోడ్డుపై పడిపోయాడని ఎస్పి తెలిపారు. కొనఊపిరితో ఉన్న రవిని 108వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించినప్పటికీ అతని ప్రాణాలు దక్కలేదని ఎస్పి తెలిపారు. నిందితులు విజయ్, అరుణ్‌లు పారిపోయే క్రమంలో విజయ్ మేనమామ గుగులోతు బావుసింగ్‌కి హత్య సమాచారం చెప్పగా.. అతను ట్రాక్టర్ దాయటానికి సహాయపడ్డాడన్నారు.
ఈ కేసులో ఘటనాస్థలిని పరిశీలించి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని నేరస్తుల కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అప్రమత్తం చేశామని ఎస్పి వివరించారు. హత్య అనంతరం విజయ్, అరుణ్‌లు పారిపోయేందుకు ప్రయత్నించగా టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని విచారించినట్లు వివరించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వారివురితోపాటు ఐదుగురు నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసులో కారు, ట్రాక్టర్, అరుణ్ ఉపయోగించిన బుల్లెట్ వాహనాలతో పాటు కత్తి, గొడ్డలి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పి తెలిపారు. కేసు త్వరగా ఛేదించటంలో భాగస్వాములైన ఎఎస్పీ యోగేశ్ గౌతమ్, డిఎస్పి పి. సదయ్య, టౌన్, రూరల్ సిఐలు వై సతీష్, సుంకరి రవికుమార్, టౌన్ ఎస్సై, ఐటి కోర్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.