ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగి ఏడుగురు కాలి బూడిదయ్యారు. ఈ ఘటన విజయ్‌నగర్ ప్రాంతంలోని స్వర్ణభాగ్ కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో జరిగింది. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇంటిలో అంతా నిద్రలో ఉండగా ఓ ఫ్లాట్‌లో షార్ట్ సర్కూట్ ఏర్పడిందని, దీనితో మంటలు వ్యాపించాయని ప్రాధమిక సమాచారంతో తేలిందని ఇండోర్ పోలీసు కమిషనర్ హరినారాయణ్ చారి మిశ్రా విలేకరులకు తెలిపారు. ఏడుగురు మంటలలో కాలిపోయినట్లు, తొమ్మండుగురిని రక్షించినట్లు చెప్పారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ 4 లక్షల చొప్పున ప్రకటించింది. అగ్ని మాపక దళాలు ఘటనాస్థలికి ఆలస్యంగా వచ్చాయని దీనితో ప్రమాదం తీరని నష్టంకల్గించిందని స్థానికులు తెలిపారు. మంటలు చెలరేగడంతో ఇతర ఫ్లాట్లలోని వారు ప్రాణభయంతో కిటికీల నుంచి కిందికి దూకారు. మంటలు ఓ ఫ్లాట్‌లో చెలరేగిన తరువాత బిల్డింగ్ ప్రధాన ద్వారం, మెట్ల మీద అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీనితో ఇతరులు కూడా అసౌకర్యానికి లోనయ్యారు. అగ్ని ప్రమాదంలో మృతులు గాయపడ్డ వారంతా 25 ఏండ్ల నుంచి 45 ఏండ్ల లోపు వారే అని వెల్లడైంది.
ఇండోర్ ఇంట్లో మంటలు.. ఏడుగురు సజీవదహనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -