చెన్నై : తమిళనాడులో నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. నెల్లికుప్పం సమీపం లోని గ్రామాలకు చెందిన మహిళలు, బాలికలు ఆదివారం మధ్యాహ్నం కెడిలం నది ఆనకట్ట సమీపం లోకి స్నానానికి వెళ్లారు. నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్థానికులు ఇది గుర్తించి వెంటనే వారందర్నీ రక్షించి కడలూరు లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో ఐదుగురు కూచిపాళయానికి చెందిన వారు కాగా, ఇద్దరు అక్కా చెల్లెళ్లు అయంకురింజిపాడి గ్రామానికి చెందిన వారు. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు ఈతకొట్టడానికి ప్రయత్నించడంతో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగి పోగా, వారిని కాపాడేందుకు వెళ్లిన ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.