భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ బాబాల ముఠా గుట్టు రట్టైంది. రాజస్థాన్ కు చెందిన ఏడుగురు నకిలీ బాబాలను భువనగిరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బ్లాక్ మ్యాజిక్ పేరుతో పలువురు నుంచి డబ్బులు వసూలు చేశారు. నకిలీ బాబాల నుంచి రూ.8.30 లక్షలను పోలీలసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్ రాష్ట్ర నకిలీ బాబా ముఠాను అరెస్ట్ చేసాం. ప్రజలకు మాయమాటలు చెప్పి అమాయకులను మోసాలకు పాల్పడుతున్న ముఠాను భువనగిరి ఎస్ ఓటి, భువనగిరి టౌన్ పోలీసులు జాయింట్ అపరేషన్ చేసి అరెస్ట్ చేసామన్నారు. రాజస్థాన్ లోని సీరోహి అనే ప్రాంతం నుండి వచ్చి మోసం చేస్తున్నారని భగవత్ తెలిపారు.
అనేక పూజలు చేసి జబ్బులు నయం చేస్తామని మోసాలను పాల్పడుతున్నారు. కొండల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు. భువనగిరికి చెందిన కొండల్ రెడ్డి ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. బైక్ మీద నుంచి కింద పడ్డ కొండల్ రెడ్డికి సర్ప దోషం ఉందని పూజ చెయ్యకపోతే ప్రాణాలు పోతాయని నమ్మించి మోసం చేశారు. సర్ప దోషం పేరుతో బాధితుడి దగ్గర 37 లక్షలు 71 వేలు వసూలు చేశారు. విచారణ చేపట్టి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసాం. నిందితుల దగ్గర నుంచి రూ. 8 లక్షల నగదు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. చాలా రాష్టాల్లో ఇదే విధంగా మోసాలు చేసినట్లు విచారణలో తెలిందని కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.