Monday, December 23, 2024

కెమికల్స్ అంటుకుని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

- Advertisement -
- Advertisement -

కౌశాంబి (ఉత్తరప్రదేశ్) : ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా మహెవా గ్రామంలో జరిగింది. ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తున్నప్పుడే ఉన్నట్లుండి భీకరమైన చప్పుళ్లతో పేలుడు చోటుచేసుకుంది. కోఖ్రాజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ గ్రామంలో తలెత్తిన పేలుడు శబ్థం పలు కిలోమీటర్ల దూరం వరకూ విన్పించింది. దీనితో జనం ఏదో జరిగిందని ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఘటన జరిగింది.

ఘటనాస్థలికి హుటాహుటిన అగ్నిమాపక శకటాలు, సహాయక బృందాలు తరలివెళ్లాయి. అంబులెన్స్‌లను పంపించామని అధికారులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ 35 ఏండ్ల షాహిద్ అనే వ్యక్తిది పేలుడు ఘటనలో ఇతరులతో పాటు ఆయన కూడా చనిపోయినట్లు గుర్తించారు. ఘటన జరిగినప్పుడు ఫ్యాక్టరీలో దాదాపు 18 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఘటనపై దర్యాప్తు చేపట్టామని ప్రయాగరాజ్ అదనపు డిజిపి భానూ భాస్కర్ తెలిపారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఇక్కడ నిల్వ ఉంచిన రసాయనికాలలో ముందుగా మంటలు చెలరేగడం పేలుడుకు దారితీసిందని వెల్లడైంది. అత్యంత శక్తివంతమైన పేలుడు కావడంతో మృతదేహాలన్ని తునాతునకలుగా దూరం వరకూ పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఫ్యాక్టరీ అన్ని రకాల అనుమతులతో లైసెన్సులతో చట్టబద్ధంగా నడుస్తోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News