ఇంఫాల్ : మణిపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నోని జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలు మార్గ నిర్మాణ పనుల్లో ఉన్న అనేక మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఏడుగురి మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది శిధిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. జిరిబామ్ ఇంఫాల్‌కు మధ్య కొత్త రైల్వే లైన్ పనులు జరుగుతున్న తరుణంలో తుపుల్ యార్డ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. “మొత్తం 45 మంది ఆచూకీ తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. కొండచరియలు విరిగిపడటం వల్ల ఐజెయ్ నది ప్రవాహం ఆగిపోయింది. వరద నీరు రిజర్వాయర్‌లా మారింది. నీటి ప్రవాహానికి కొండచరియలు పక్కకు జరిగిపోతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలను బయటకు రానీయకండి” అని నోనె జిల్లా ఎస్డీ సోలోమన్ పైమేట్ సూచించారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రక్షణ దళాలు శ్రమిస్తున్నాయని చెప్పారు. వైద్యులతో సహా అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయని వెల్లడించారు.
మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -