ముంబై : మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 24 గంటల వ్యవధిలో 12 మంది శిశువులు, చిన్నారులు సహా 24 మంది రోగులు చనిపోగా, అర్ధరాత్రి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులున్నారు. దీంతో ఆస్పత్రిలో గడిచిన 48 గంటల వ్యవధిలో మరణించిన వారి సంఖ్య 31 కి చేరింది.
ఈ మరణాలపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ కమిటీ తమ నివేదిక ను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ అంశంపై విపక్షాలు మహారాష్ట్ర సర్కారు తీరును తప్పు పట్టాయి. మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మరోవైపు రోగుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి డీన్ శంకర్‌రావు చవాన్ తెలిపారు. పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.
అలాగే మందుల కొరతతో రోగులు మరణించినట్టు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. చాలా మంది రోగులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారని, దీనికి తోడు వైద్యం అందడంలో జాప్యం ఫలితంగా చికిత్సకు స్పందించే పరిస్థితి దాటిపోవడంతో మరికొంతమంది చనిపోయారని తెలిపారు. సోమవారం మృతి చెందిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారని మహారాష్ట్ర వైద్య విద్య పరిశోధన విభాగం సంచాలకుడు దిలీప్ మైశేఖర్ వెల్లడించారు.