పది మంది కళ్లు పొయ్యాయి
ఛాప్రా : బీహార్‌లో కల్తీసారా సేవించిన వారిలో కనీసం ఏడుగురు దుర్మరణం చెందారు. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి కంటిచూపు కూడా పోయింది. ఈ ఘటన సరన్ జిల్లాలో జరిగింది. బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. ఈ దశలో మత్తుకోసం తీసుకుంటున్న నాటు కల్తీసారాలు జనానికి ప్రాణసంకటం అయ్యాయి. మకెర్ పోలీసు స్టేషన్ పరిధిలో కల్తీసారా బాధితుల ఘటనలు తమ దృష్టికి వచ్చాయని జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు. ఏడుగురు మృతి చెందగా , కనీసం పది మంది కంటిచూపు పోయిందని వివరించారు. ఈ గ్రామాలలో ఎంత మంది ఈ అక్రమ సారా తీసుకున్నారనేది వెల్లడికాలేదు. గ్రామస్తులు వివరాలను తెలియచేసేందుకు ముందుకు రావడం లేదు. నిషేధ చట్టం అమలులో ఉండటంతో తమపై చర్యలు ఉంటాయని వారు భయపడుతున్నారు. దీనితో వెంటనే బాధితులకు చికిత్స జరిపేందుకు వీలు కావడం లేదని కలెక్టర్ వివరించారు. ఈ ప్రాంతంలో అక్రమ మద్యం వ్యాపారులు, విక్రయదార్లను అరికట్టేందుకు ఎక్సైజ్ , పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి.