నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల అనుమానం
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఏడుగురు వ్యక్తుల ఆచూకీ గత రెండు రోజులుగా తెలియడం లేదని, వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా.. బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో సంఘటనలో తమ పార్టీని వీడిన ఒక మాజీ సహచరుడిని నక్సల్స్ చంపివేసినట్లు పోలీసులు చెప్పారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలోని జగర్గుండ పోలీసు స్టేషన్ పరిధిలోని కుందేద్ గ్రామంలో అంతుచిక్కని కారణాలతో నక్సల్స్ ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని సుక్మా జిల్లా ఎస్పి సునీల్ శర్మ తెలిపారు. అయితే గ్రామస్తులు తమకు తాముగా నక్సల్స్ వెంట వెళ్లారా లేక వారిని నక్సల్స్ కిడ్నాప్ చేశారా అన్న విషయం తెలియరాలేదని ఆయన చెప్పారు. కనిపించకుండా పోయిన ఆ ఏడుగురు గ్రామస్తుల ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్నామని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆయన చెప్పారు. తమ వర్గాల ద్వారా మాత్రమే ఆ ఏడుగురు వ్యక్తుల అదృశ్యం గురించి తమకు సమాచారం అందిందని ఆయన వివరించారు. ఇలా ఉండగా, బీజాపూర్ జిల్లాలో తమ మాజీ సహచరుడు రాజు వెంజమ్(28) అనే వ్యక్తిని నక్సల్స్ ఆదివారం హతమార్చారని ఎస్పి చెప్పారు. పార్టీని వీడి సాధారణ జీవితాన్ని గడుపుతున్న వెంజమ్ పాడెడ గ్రామంలోని తన పొలంలో పనిచేసుకుంటుండగా ఆదివారం నక్సల్స్ కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలోని రోడ్డుపైన వెంజమ్ మృతదేహం లభించిందని, అతని శరీరంపై పదునైన ఆయుధాలతో చేసిన గాయాలు ఉన్నాయని ఎస్పి చెప్పారు.