Sunday, December 22, 2024

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

సూరత్ : గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కుటుంబం విషాదాంతం చెందింది. అప్పుల భారం కడతేర్చింది. శనివారం ఉదయం ఈ కుటుంబసభ్యులు ఏడుగురు వారి నివాసంలోనే మృతి చెంది ఉండగా కనుగొన్నారు. ఈ ఘటన కలకలం రేపింది. ఇది కుటుంబ సామూహిక ఆత్మహత్య చర్యగా పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఇతర కోణాల నుంచి కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వజ్రాల నగరంగా పేరొందిన సూరత్ అదాజన్ ప్రాంతంలోని సిద్ధేశ్వర్ అపార్ట్‌మెంట్‌లో వరుసగా వీరి మృతదేహాలు లభించాయి. వీరి నివాసంలోనే ఓ లేఖ కూడా దొరికింది. కోలుకోలేని విధంగా తాము పలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నామని, తట్టుకోలేక ఈ తీవ్రస్థాయి చర్యకు పాల్పడుతున్నామని, అంతా బలవన్మరణం చెందుతున్నామని ఈ లేఖలో పేర్కొని ఉందని పోలీసులు తెలిపారు. మృతులలో ఆరుగురు విషం తాగినట్లు, ఒక్కరు ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు.

ఓ వ్యక్తి ఆయన భార్య, ఆయన తల్లిదండ్రులు, దంపతుల ఆరేండ్ల కొడుకు, పది, పదమూడు సంవత్సరాల కూతుళ్లు మృతి చెందారు. వీరి ఆత్మహత్య ఉదంతం శనివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిందని సూరత్ జోన్ 5 డిసిపి ఆర్‌పి బారోత్ తెలిపారు. కాంట్రాక్టరుగా ఉన్న 37 సంవత్సరాల మనీష్ సోలంకీ ఈ కుటుంబ ప్రధాన పోషకుడుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యక్తి కుటుంబ సభ్యులకు ముందు విషం ఇచ్చి, తరువాత తాను ఉరివేసుకుని చనిపోయినట్లు అక్కడి పరిస్థితినిబట్టి భావిస్తున్నామని స్థానిక అధికారి ఒక్కరు తెలిపారు. ఓ వ్యక్తికి చెల్లించాల్సిన రుణం తీర్చలేని స్థితికి రావడంతోనే కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడ దొరికిన నోట్ ద్వారా స్పష్టం అయింది. నివాసంలో విషపూరిత పదార్థం ఉన్న ఓ సీసాను కూడా కనుగొన్నట్లు డిసిపి తెలిపారు. నగరంలో జరిగిన ఈ ఘటన అత్యంత దారుణమని స్థానిక మేయర్ నిరంజన్ జాంజ్‌మెరా చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News