ఏడుగురు విద్యార్థులు, టీచర్ మృతి
మరో 21 మందికి గాయాలు
పోలీసులు అదుపులో దుండగుడు
మాస్కో: రష్యాలోని ఓ స్కూల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు, ఒక టీచర్ సహా ఎనిమిది మంది చనిపోగా, మరో 21 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని రష్యా అధికారులు తెలిపారు. కజన్ నగరంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుపాకుల శబ్దం వినిపిస్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు మూడో అంతస్తునుంచి దూకడం వీడియోలో కనిపించింది. ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు కాల్పులకు పాల్పడినట్లు చెబుతుండగా, కొందరు మాత్రం నిందితుడు ఒకడేనని అంటున్నారు. స్కూల్లో పేలుడు కూడా జరిగినటు తెలుస్తోంది. 19ఏళ్ల దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు తెలియరాలేదు. మరో దుండగుడు పారిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి స్కూల్లో కాల్పుల ఘటనలు రష్యాలో చాలా అరుదు.
2018లో చివరిసారిగా క్రిమియాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ కాలేజి విద్యార్థి జరిపిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు చనిపోయారు.ఆ తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకున్నాడు. ముసిల ప్రాబల్యం కలిగిన టటరిస్థాన్ రాజధాని కజన్. ఇది రాజధాని మాస్కోకు 725 కిలోమీటర్ల దూరంలో ఉంది. గాయపడిన వారినందరినీ ఆస్పత్రిలో చేర్చామని సంఘటనా స్థలాన్ని సందర్శించిన రాష్ట్ర గవర్నర్ రుసత్మ్ మిన్నిఖనోవ్ తెలిపారు. గాయపడిన వారిలో 18 మంది పిల్లలుండగా, వీరిలో ఆరుగురు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. సంఘటన పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి నేపథ్యంలో గన్ విధానాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.