న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో దుండగుడి కాల్పులు
నిర్మాణ రంగ కార్మికుడి దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు
13 మందికి గాయాలు
నెత్తురోడుతూ ప్లాట్‌ఫామ్‌పై బాధితులు పడి ఉన్న దృశ్యాలు
క్షతగాత్రుల్లో భారతీయులూ ఉండొచ్చన్న ఎంబసీ
నూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో 36వ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13 మంది కి గాయాలయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు కొన్ని కథనాలు వచ్చాయి కానీ వాటిని అధికారులు ధ్రువీకరించలేదు. నెత్తురోడుతున్న గాయాలతో బాధితులు స్టేషన్ స్లాట్‌ఫామ్‌పైనే పడిఉన్నట్లు ఫొటోలు బైటికి వచ్చాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రద్దీ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఘటనా స్థలంలో కొన్ని పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు వార్తలు వచ్చినా ఇప్పటివరకు అలాంటి ఆధారాలు అభ్యం కాలేదని న్యూయార్క్ పోలీసులు చెప్పారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న వారు విచారణ ప్రారంభించారు. బ్రూక్లిన్‌లోని 36వ స్ట్రీట్, 4వ అవెన్యూ ప్రాంతానికి వెళ్లొద్దని పౌరులను సూచనలు జారీ చేశారు. సబ్‌వేనుంచి భారీగా పొగ వస్తుండడం, సహాయక చర్యల నేపథ్యంలో ఆ ప్రాంతాన్నంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని పాఠశాలలన్నిటినీ మూసివేశారు.
కాగా కాల్పులు జరిపిన దుండగుడు నిర్మాణ రంగ కార్మికుడి దుస్తులు , గ్యాస్ మాస్క్ ధరించి ఉన్నట్లు తెలుస్తోందని ఎన్‌వై 1వార్తాసంస్థ తెలిపింది. ఆ వ్యక్తి ముందుగా జనం దృష్టిని మళ్లించడానికి ఒక పొగ డబ్బాను విసిరేసి ఉంటాడని స్థానికులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశంలో తుపాకుల వినియోగంపై కొత్త నియంత్రణ చర్యలను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంటున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. న్యూయార్క్‌లో హైఅలర్ట్ మాత్రం ప్రకటించారు. ఇదిలా ఉండగా న్యూయార్క్ సబ్‌వే కాల్పుల ఘటనలో గాయపడిన వారిలో భారతీయులు కూడా ఉండి ఉండవచ్చని ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.