ఆమోదించిన టిఎన్జీఓ రాష్ట్ర, కేంద్ర కార్యవర్గం
డిఏలను, పిఆర్‌సి బకాయిలను విడుదల చేసినందుకు
సిఎం కెసిఆర్ టిఎన్జీఓ నాయకుల కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో టిఎన్జీఓ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగింది. పెండింగ్‌లో ఉన్న డిఏలను, పిఆర్‌సి బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి 2022 సంవత్సర డైరీ, క్యాలండర్‌ను టిఎన్జీఓ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం పలు తీర్మానాలకు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కేంద్ర కార్యవర్గం సైతం పాల్గొంది.
తీర్మానాలు ఇలా….
1.317 ఉత్తర్వుల ప్రకారం భార్యా,భర్తలకు (Spouse) అన్ని జిల్లాలో పనిచేయడానికి అవకాశం కల్పించాలి.
2.ఉద్యోగుల పరస్పర బదిలీలలో జిల్లాల కేడర్ సీనియార్టీ భద్రతను కల్పించిన విధంగా జోనల్ కేడర్ పోస్టులకు కూడా పాత సీనియార్టీ భద్రత కల్పించాలి. జిల్లా, జోనల్ బదిలీల్లో అన్ని స్థాయిల ఉద్యోగులు చేసుకున్న అర్జీలను పరిష్కరించాలి.
3.ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేస్తూ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం పిఆర్సీ కమిటీ సూచించిన విధంగా అన్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలి. అందుకుగాను ఉద్యోగుల మూల వేతనం నుంచి 2 శాతం వేతనాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తామని సమావేశంలో నాయకులు తీర్మానించారు.
4.పిఆర్సీ వ్యత్యాసాలను సవరించడం కోసం వెంటనే అనామలిస్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్నీ ఉత్తర్వులను విడుదల చేయాలి.
5.మెడికల్ ఇన్ వాలిడేషన్ కొరకై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలి. మెడికల్ ఇన్ వాలిడేషన్ పొందిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలను కల్పించాలి.
6.సాధారణ బదిలీలను చేపట్టే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాలి.
7.రాష్ట్రంలో వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.
8. కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను పరిమితిని 2 .50 లక్షల నుంచి పది లక్షలకు పెంచాలి.
9.కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.