ఆ దేశాలకు మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ
గ్లాస్గో: ద్వీప దేశాల మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుల వల్ల ఈ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ప్రధాని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్26 రెండోరోజు కార్యక్రమాల్లో ప్రధాని మోడీతోపాటు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మోరిసన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పాల్గొన్నారు. కొన్ని దశాబ్దాలుగా పర్యావరణ మార్పుల గురించి ఎవరూ పట్టించుకోలేదని ప్రధాని అన్నారు. వాతావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు అందరికీ ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన అన్నారు.
వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న విపత్తులు పర్యాటకంపై ఆధారపడిన ద్వీపదేశాల ప్రజల జీవతాలకేగాక, వారి ఆర్థిక వ్యవస్థలకూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ప్రధాని గుర్తు చేశారు. వాతావరణ మార్పుల వల్ల పసిఫిక్ దీవులు, కారికోమ్ దేశాలకు ఏర్పడే ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధాని తెలిపారు. భారత రోదసీ సంస్థ ఇస్రో ద్వారా వారికి ఎప్పటికపుడు తుపాన్లు, వాతావరణ విపత్తుల సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు. విపత్తు నిర్వహణ మౌలిక వసతుల సంస్థ(సిడిఆర్‌ఐ)ని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారత్ చేస్తున్న కృషిని బోరిస్ జాన్సన్ కొనియాడారు. సిడిఆర్‌ఐకి నేతృత్వం వహిస్తున్నందుకు భారత్, యుకెలకు ఆస్ట్రేలియా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సిడిఆర్‌ఐకి అమెరికా, జపాన్‌సహా క్వాడ్ దేశాల మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.