రాజ్యసభలో కేంద్రహాంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
న్యూఢిల్లీ : రైతుల ఆందోళనలో ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధం చేయడం వల్ల ప్రభుత్వంతోపాటు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. శివసేన ఎంపి అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఘాజీపూర్, టిక్రీ, సింఘూ సరిహద్దుల్లో రైతుల ఆందోళనతో ఢిల్లీతోపాటు ఢిల్లీ సరిహద్దులను పంచుకున్న రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. రైతులు తమ ఆందోళనలో నేరస్తుల ముఠాను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వహించనీయకుండా బెదిరించారని, ఫలితంగా డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్నా రైతులు తమ ఆందోళనలో సామాజిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా భారీ ఎత్తున గుమికూడారని ఆరోపించారు. రైతుల చర్యలను నివారించడానికి ఢిల్లీ పోలీసులకు భాష్పవాయువు, జలఫిరంగులు వాడడం తప్ప వేరే గత్యంతరం లేక పోయిందని చెప్పారు. రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చేవారెవరికి కూడా ఎన్‌ఐఎ నుంచి కానీ, ఈడీ తరఫున కానీ ఎలాంటి సమన్లు అందలేదని స్పష్టం చేశారు.