విద్యాలయాలకు, వసతి నిలయాలకు విద్యుత్ సరఫరాను తొలగించొద్దు
టిబి రోగులను దత్తత తీసుకోవాలి
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటామని అధికారులు దీనిపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. శనివారం బేగంపేట్ టూరిజం ప్లాజాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, దిశ సభ్యులు పాల్గొని పలు అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అన్ గోయింగ్ ప్రాజెక్ట్ పనుల పై అధికారులను అరా తీశారు పలు సూచనలు చేశారు. వివిధ అంశాల వారీగా కిషన్‌రెడ్డి సమీక్షించారు.
పేదల బస్తీల్లో బోర్‌వెల్స్ మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో దశాబ్దాల క్రితం కట్టిన వాంబే ఇండ్ల శిథిలావస్థకు చేరుకున్న ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వలేదని దిశ సభ్యులు లెవనెత్తడంతో స్పందించిన అధికారులు మొత్తం 164 ఇళ్లలో 108 పేదలకు పంపిణీ చేశామని మిగితా 56 కోర్టులో రిట్ పిటిషన్ వలన పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిని వెంటనే అర్హులైన పేదలకు అందించాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పనుల్ని పర్యవేక్షించడం, పనులను వేగవంతంగా జరిగే విదంగా పని చేయాలని కోరారు. పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తేనే ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేరుతాయని అధికారులకు సూచించారు. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపడతాయన్నారు.
విద్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయొద్దు ..
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, వసతి నిలయాలకు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని తరుచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని దిశ సభ్యులు ప్రస్తావించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు శాఖల వారీగా ఉన్న నిబంధనలను అధికారులు వెల్లడించడంతో.. సంబంధిత ఉన్నతాధికారుల ఈ విషయంపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రంగాలకు ఉచితంగా విద్యుత్ సరఫరాను ప్రభుత్వం చేస్తోందని, అందులో భాగంగా విద్యాలయాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వంట సామాగ్రిని అందించాలని సభ్యులు కోరగా.. బిజెపి నేత చింతల రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. త్వరలోనే తమ పార్టీ తరుపున సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు వంట సామాగ్రిని అందజేస్తామని వెల్లడించారు.
నిర్ణీత గడువులో పథకాలు అమలు చేయండి..
వివిధ పథకాలు అమలుకు వాటిని ప్రజల్లోకి తీసికెళ్లి స్థానిక ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తూ.. నిర్ణీత సమయంలో పథకాలు అమలయ్యేలా చూడాలని అధికారులను కిషన్‌రెడ్డి ఆదేశించారు. పథకాల అమలు విషయంలో రాజీలేకుండా, రాజకీయాలకు తావులేకుండా.. ప్రజలకు మేలు జరిగే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. బస్తీ దవాఖానాల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.బస్తీ దవాఖానాల్లో డాక్టర్స్ వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ప్రజల ఆరోగ్యం కోసం కేంద్రప్రభుత్వం అనేక పథకాలు కార్యక్రమాలు చేపట్టిందని వాటి అమలు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.రాష్ట్రంలో 9వేలకు పైగా టిబి రోగులు ఉన్నారని వారి దత్తత కార్యక్రమంలో మరింత అవగాహన కల్పించాలని కోరారు.
ట్రైబల్ మ్యూజియంకు రూ.25 కోట్లు..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ మ్యూజియం నిర్మాణానికి అబిడ్స్‌లో 75సెంట్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అధికారులు చెప్పడంతో దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ట్రైబల్ మ్యూజియం కు 25 ఎకరాలు కేటాయించారని వెల్లడించారు. ఓ చారిత్రాత్మక మ్యూజియం కు 75సెంట్లు ఎలా సరిపోతుందని మంత్రి అధికారులను ప్రశ్నించారు. రూ. 25 కోట్లతో నిర్మించనున్న ఈ మ్యూజియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు ఇవ్వనుందని అధికారులు తెలిపారు. రేషన్ దుకాణాల నిర్వహణలో కొనసాగుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని సభ్యులు కోరారు దుకాణాల మధ్య దూరం పెరగడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని దూరం తగ్గించి షాప్స్ పెంచాలని కోరారు. తొమ్మిదేళ్ల నుంచి రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వలేదని వాటిని వెంటనే అర్హులైన పేదలకు ఇవ్వాలని సభ్యులు కోరారు.
జిహెచ్‌ఎంసి అధికారుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం..
మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా సమావేశానికి జిహెచ్‌ఎంసి అధికారులు హాజరు కాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ఉందని తెలిసి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఎలా పెట్టుకుంటారని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఒప్పుకున్నా.. జిహెచ్‌ఎంసీ సహకరించడం లేదని కిషన్ రెడ్డి దృష్టికి రైల్వే అధికారులు తెచ్చారు. దిశ సమావేశం పెట్టుకుంటే కనీసం సమావేశంలో సమాధానం చెప్పేవారు కూడా లేరని మండిపడ్డారు.