Wednesday, January 22, 2025

ప్రజ్వల్ సోదరుడు సూరజ్ రేవణ్ణపై లైంగిక దాడి ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

జెడిఎస్ ఎంఎల్‌సి సూరజ్ రేవణ్ణపై లైంగిక దాడికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు నమోదైతే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూరజ్ రేవణ్ణపై ఇప్పటివరకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. తనకు ఈ విషయం మీడియా ద్వారానే తెలిసిందని ఆయన అన్నారు. అశ్లీల వీడియోల కుంభకోణంలో అరెస్టయిన జెడిఎస్ మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడైన సూరజ్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడకు స్వయానా మనవడు. జిజిపి ఎదుట సూరజ్ రేవణ్ణపై పిర్యాదు పిటిషన్ పెండింగ్‌లో ఉందని విలేకరులు ప్రశ్నించగా అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని పరమేశ్వర తెలిపారు. ఇలా ఉండగా..ఈ పరిణామాలపై కేంద్ర ఆహార, వినిమయ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని కోరారు. నేరస్థులు ఎంతటివారైనా వారిని శిక్షించాల్సిందేనని ఆయన చెప్పారు.

ప్రజ్వల్ రేవణ్ణ కాని సూరజ్ రేవణ్ణ కాని తప్పు చేస్తే వారిని శిక్షించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. కాగా..సూరజ్ రేవణ్ణ బాబాయ్, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిరాకరించారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను విలేకరులు సూరజ్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నించగా తన వద్దకు ఈ విషయాలను తీసుకురావద్దని ఆయన చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి తన వద్ద ప్రస్తావించాలని ఆయన అన్నారు. ఈ విషయమై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. చట్టం తన పని తాను చేస్తుందని, ఈ ఫిర్యాదులను ఎందుకు నమోదు చేస్తున్నారో రానున్న రోజుల్లో తెలుస్తుందని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా జెడిఎస్ సీనియర్ నాయకుడు బెండెప్ప కషెంపూర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ తప్పు ఎవరు చేసినా చట్టం శిక్షిస్తుందని చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణపై పార్టీ చర్యలు తీసుకుందని, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలను పంపిణీ చేశారని, ఇప్పుడు సూరజ్ రేవణ్ణపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా..కర్నాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ దేశంలో చట్టాలు ఉన్నాయని, చట్ట ప్రకారం ఘటనపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసులో మీడియా వార్తల ఆధారంగా తాను స్పందించలేనని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా..జెడిఎస్ ఎంఎల్‌సి సూరజ్ రేవణ్ణపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బదిరింపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులపై కర్నాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడినట్లు హసన్ జిల్లాలోని అరకలగోడు పట్టణానికి చెందిన జెడిఎస్ కార్యకర్త ఒకరు ఆరోపణలు చేశారు. దీనిపై సూరజ్ రేవణ్ణ సహాయకుడు శివకుమార్ హోలెనరసీపుర పోలీసు స్టేషన్‌లో బాధితురాలు, ఆమె బంధువుపై ఫిర్యాదు చేశారు. డబ్బు వసూలు చేయడానికి సూరజ్ రేవణ్ణపై తప్పుడు ఆరోపణలు చేశారని శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News