Thursday, January 16, 2025

బాలికపై అత్యాచార యత్నం..స్థానికుల దాడిలో నిందితుడు మృతి

- Advertisement -
- Advertisement -

ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగినట్లు తల్లి ఆరోపించడంతో ఆమె కుటుంబ సభ్యులు రెడ్యా నాయక్ (50) అనే వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, వీరన్న గుట్ట తండాకు చెందిన ఓ బాలిక గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్థానికంగా రెడ్యానాయక్ నడుపుతున్న కిరాణా దుకాణంలోకి బిస్కెట్ల కొనుగోలు కోసం వెళ్లింది. బాలిక చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి దుకాణం వైపు వెళ్ళింది. దుకాణ యజమానిని ఆమె ప్రశ్నించగా, తాను పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కొందరు ఆ వ్యక్తిపై దాడి చేశారు. దాడిలో గాయపడిన రెడ్యానాయక్‌ను 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వసుపత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు.

బాలికను సైతం వైద్య పరీక్షల కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ముంబైలో ఉండడంతో అతని తరపున ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. దాడి చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇదిలావుండగా, రెడ్యానాయక్ మృతి చెందడంతో తండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పరిస్థితిని గమనించిన పోలీస్ అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రత్యేకమైన బలగాలను తండాలో మోహరించి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, పహారా కాస్తున్నారు. ట్రైనీ ఐపిఎస్ అధికారి సాయి కిరణ్ గ్రామాన్ని సందర్శించి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు బోధన్ ఏసిపి శ్రీనివాస్, రూరల్ సిఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్‌ఐ సాయన్నతో పాటు పలువురు సిఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News