Tuesday, November 5, 2024

దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపే

- Advertisement -
- Advertisement -

Sexual harassment by touching body parts from clothing

పోక్సోచట్టంపై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: ‘బాలిక శరీరాన్ని నేరుగా తాకనప్పుడు(స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు) ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపు కిందికి రాదు’ అంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. దుస్తుల పైనుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు తీర్పు చట్టానికి సంకుచిత వివరణ ఇచ్చేలా ఉందని వ్యాఖ్యానించింది. ‘ చట్టాలు స్పష్టమైన ఉద్దేశాలు వెల్లడించినప్పుడు .. న్యాయస్థానాలు ఆ నిబంధనల్లో గందరగోళం సృష్టించకూడదు. సందిగ్ధతను సృష్టించడంలో న్యాయస్థానాలు అత్యుత్సాహాన్ని చూపడం సరికాదు. ఇక్కడ పోక్సో చట్టం ఉద్దేశం చిన్నారులను లైంగిక వేధింపులనుంచి రక్షించడం. లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశంతో బాలికను తాకినప్పుడు అది నేరం కిందే లెక్క. అంతేకాని.. నేరాన్ని పరిగణించేటప్పుడు నిందితుడు బాలిక శరీరాన్ని నేరుగా స్పృశించాడా లేక దుస్తులపైనుంచి తాకాడా అన్నది అనవసరం’ అని జస్టిస్ యు యు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ధర్మాసనంలో జస్టిస్ ఆర్ రవీంద్ర భట్, బేలా ఎం త్రివేది కూడా ఉన్నారు.

కేసు పూర్వాపరాలు

2016లో సతీష్ అనే వ్యక్తి బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేయగా సెషన్స్ కోర్టు నిందితుడ్ని పోక్సో చట్టం కింద దోషిగా పేర్కొంటూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా ..అక్కడి నాగపూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఓ బాలిక శరీరాన్ని దుస్తుల పైనుంచి తాకినంతమాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి లేదా దుస్తుల లోపలికి చెయ్యి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందికి వస్తుందని మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుఫ్పా గనేడివాలా పేర్కొన్నారు. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు.ఈ తీర్పుపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పును నిలిపి వేయాలంటూ అటార్నీ జనరల్‌తో పాటుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 27న సర్వోన్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపి వేసింది. తాజాగా ఆ తీర్పును కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News