లక్నో : భారత రెజ్లర్ల సమాఖ్య అధినేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా గోండా రాజ్ సాగిస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు గోండా, బలరాంపూర్, బహారైచ్, శ్రవాస్త్రి మీదుగా వెళ్లే అయోధ్య గోండా జాతీయ రహదారి వెంబడి ఇరువైపులా ఆయన లేదా ఆయన తరఫున 54 విద్యాసంస్థలు సాగుతున్నాయి. వీటిలో దాదాపు 80వేల మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. యుపికి వెళ్లే వారికి పవిత్ర సరయూ నదీ ఆనుకుని ఉన్న ప్రాంతంలో పలు చోట్ల భారీ స్థాయి కటౌట్లు కన్పిస్తాయి. వాల్ పోస్టర్లు ఈ విద్యాసంస్థల తరఫున ఉంటాయి. వీటిలో అనేకం సింగ్ భారీ ఫోటోలతో దర్శనమిస్తాయి. ఇక్కడ అంతా గోండా రాజ్ వాతావరణం ఉంటుందని ప్రతిపక్షమైన సమాజ్‌వాది పార్టీ పలు సార్లు పేర్కొంది.
మహిళా రెజ్లర్ల పట్ల జుగుప్సాకర లైంగిక వేధింపులకు దిగాడని ఆయనపై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. రెజ్లర్లు ఆయనపై చర్యకు పట్టుపడుతున్నారు. ఈ కోణంలో విద్యావ్యాపారం పేరిట ఆయన సాగిస్తున్న దందాలు ఇప్పుడు వెలుగులోకి వచ్కాచయి. నవాబ్‌గంజ్ ప్రాంతంలో సింగ్ తిరుగులేని దాదాగిరితో వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. పలు విద్యాసంస్థలు వీటి ద్వారా సాగించే పథకాల వ్యవహారాలతో ఆయన ఈ ఏరియాలో తిరుగులేని ప్రాబల్యం, పట్టు దక్కించుకున్నారు. ప్రత్యేకించి యువత రైతులను ఆకర్షితులు చేసుకుంటూ పలుకుబడిని పెంచుకుంటున్నట్లు వెల్లడైంది. ప్రాంతీయులకు గాలం వేసుకుంటూ వారిని తన వైపు మల్చుకుంటూ సింగ్ దర్జాగా సాగుతున్నట్లు వెల్లడైంది.
80వేల మంది విద్యార్థులు, 3500 మంది టీచర్లుతో విద్యాసంస్థలు సాగుతున్నాయి. గోండా టౌన్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని నవాజ్‌గంజ్‌కు సింగ్‌కు కంచుకోట అయింది. ఇక్కడ ఆయనకు ఓ పెద్ద హోటల్ కూడా ఉందని వెల్లడైంది. ఆయన ఆధ్వర్యంలో ఓ షూటింగ్ రేంజ్, నేషనల్ రెజ్లింగ్ అకాడమీ నడుస్తోంది. సింగ్ కైసర్‌గంజ్ నుంచి బిజెపి ఎంపిగా ఉన్నారు.