కొచ్చిన్: ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ తప్పుడు వార్తా కథనాన్ని ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు శుక్రవారం రాత్రి కేరళలోని కొచ్చిన్‌లోగల ఏషియా నెట్ న్యూస్ చానల్ కార్యాలయంలోకి చొరబడి అక్కడి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. టివి చానల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలో అధికార సిపిఎం అనుబంధ విధ్యార్థి విభాగమైన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చానల్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఎస్ఎఫ్‌ఐ కార్యకర్తలు చానల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భద్రతా సిబ్బందిని పక్కకు నెట్టివేసి మరీ కార్యాలయంలోకి చొరబడ్డారు.
పనిచేస్తున్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఉత్తర కేరళలోని ఒక పాఠశాలలో 10 మంది బాలికలపై లైంగిక దాడి జరిగిదని ఆరోపిస్తూ ఒక మైనర్ బాలికకు సంబంధించిన వార్తను ఆ చానల్ ప్రసారం చేసినట్లు సిపిఎం వర్గాలు శనివారం తెలిపాయి. తప్పుడు వార్తను ప్రసారం చేసినందుకు నిరసన తెలియచేయడానికి ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆ చానల్ కార్యాలయానికి వెళ్లారని వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల చర్యను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపించాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.