Monday, January 20, 2025

కమ్ముకొస్తున్న కరువు ఛాయలు !

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంపైన కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. వర్షాధారంగా సాగుచేసిన పలు రకాల పైర్లపైన కరువు ప్రభావం పడుతోంది.వర్షానికి వర్షానికి మధ్య దూరం పెరుగుతోంది. మెట్ట కింద సాగు చేసిన పై ర్లు బెట్టకు గురవుతున్నాయి. ఈ నెలలో కురవాల్సిన సాధారణ సగటు వర్షపాతంలో పెద్ద ఎత్తున లోటు ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పలు రకాల పైర్లపైన పెను ప్రభావం పడనుంది. మొక్కలు గిడసబారి , పైర్లు ఎండిపోయి, పంట ది గుబడులుతగ్గుతాయన్న ఆందోలనలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కింద అన్ని రకాల పంటలు కలిపి 1.24కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అందులో ఇప్పటికే 1.09 కోట్ల ఎకరాల్లో పంటలు వేయటం ద్వారా సాగు విస్తీర్ణం 88.37శాతానికి చేరుకుంది. సాగులోకి వచ్చిన పంటల్లో కంది, మినుము, పెసర ,ఉలవ, తదితర పప్పుధాన్య పంటలతోపాటు వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, తదితర నూనెగింజ పంటలు , జొన్న రాగి, సజ్జ తదితర చిరుధాన్య పంటలతో పాటుగా పత్తి పొగాకు తదితర వాణిజ్య పంటలు కూడ అధిక శాతం ఆరుతడి , వర్షాధారంగానే సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ పంటలన్ని వెజిటేటివ్ దశలో ఉన్నాయి. ఈ దశలో వర్షం లేకపోతే పైర్ల పెరుగుదల మందగించనుంది. నేలలో తేమ శాతం తగ్గిపోయి వర్షాభావం పెరిగే కొలది పైర్లు నిలువునా ఎండిపోయే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులనుంచి పంటలను కాపాడుకోవటం ఎలా అన్నదే ఇప్పడు రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. వర్షాలు పడకపోతే సాగు నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టులో సాగు చేసిన పంటలతోపాటు, భూగర్భ జలాల ఆధారంగా బోర్ల కింద సాగుచేసిన పంటలపై కూడా ఆ ప్రభావం పడనుంది.
ఈ నెలలో 62శాతం లోటు వర్షపాతం
రుతు పవనాల ప్రభావం ఈ సారి ఖరీఫ్‌పంటల సాగును తీవ్రంగానే కనిపిస్తోంది. జూన్‌నెలలో నైరుతి రుతుపవనాల రాకలో జరిగిన జాప్యం వల్ల పంటలకు విత్తనాలు వేసే అదనులో ఆలస్యం అనివార్యం అయింది. జులైలో కురిసిన అధిక వర్షాలకు అప్పటికే సాగు చేసిన లేతపైర్లు నీటిమునకకు గురై కొంత, నేలలో తేమశాతం అధికమై వేర్లు కుళ్లిపోయి దెబ్బతిన్న పైర్లు కొంత, వరదల తీవ్రతకు నీట మునకేసిన పైర్లు మరికొంత దెబ్బతిన్నాయి. సకాలంలో తగిన జాగ్రత్తలతో రైతులు సాగు చేసిన పంటలకు కాపాడుకునేందుకు ప్రయాస పడాల్సివచ్చింది. ఆగస్ట్‌లో వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్ నుంచి ఆగస్ట్ వరకూ రాష్ట్ర సగటు వర్షపాతం 720.4 మి.మి కాగా, ఈ మూడు నెలల కాలంలో ఇప్పటివరకూ సాధారణ వర్షపాతం 575.9 మి.మి నమోదు కావాల్సివుంది. అయితే ఇప్పటిరకూ 624.7 మి.మి వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకూ కురిసిన వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్ర సగటులో 20శాతం అధిక వర్షపాతం నమోదు జరిగింది. నెలల వారీగానే వర్షపాతంలో సమన్వయం లోపిస్తోంది. జూన్‌లో 129.4 మి.మి సాధారణ వర్షపాతానికి గాను 72.6మి.మి వర్షంతో 44శాతం లోటు ఏర్పడింది. జులైలో 229.1మి.మి సాధారణ వర్షపాతానికిగాను 490 మి.మి వర్షం కురిసింది. ఈ నెలలో అధిక వర్షపాతంతో వ్యవసాయరంగం జోములెత్తిపోయింది.

ఈ నెలలో 217.4 మి.మి సాధారణ సగటు వర్షపాతానికి గాను ఈ సమయానికి 163.5 మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుంది. అయితే ఈ నెలలో ఇప్పటివరకూ 62.2 మి.మి వర్షపాతం మాత్రమే నమోదు జరిగింది. ఈ నెల వర్షపాతంలో భారీ లోటు ఏర్పడింది. అంతే కాకుండా వర్షానికి వర్షానికి మధ్య కాలం కూడా పెరిగింది. సాధారణ పరిస్థితుల్లో అయితే వర్షాధారంగా పైర్లు సాగు చేసిన ప్రాంతాల్లో వర్షానికి వర్షానికి మధ్య ఎడం 10నుంచి 15 రోజుల వరకైతే పైర్లు తట్టుకొగలవని , అంతకు మించి దూరం పెరిగితే పైర్లు బెట్టకు గురవుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోనే అధిక వర్షపాతం నమోదు జరిగింది. మొత్తం 17జిల్లాల్లో అధిక వర్షం కురిసింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని 16 జిల్లాలు సాధారణ వర్షపాతంతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. అయితే రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతంలో పెరిగిన లోటు ఇప్పటికే 62శాతం ఉన్నట్టు వాతావరణ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే వర్షాధారంగా సాగు చేసిన మెట్టపంటలపై కురవు ఛాయలు వేగంగా కమ్ముకుంటాయన్న దిగులు ఖరీఫ్ రైతాంగాన్ని వేంటాడుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News