Thursday, July 4, 2024

కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలేనా?

- Advertisement -
- Advertisement -

షాద్‌నగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో మొన్న జరిగిన పేలుడు ఘటన దారుణం, అత్యంత దురదృష్టకరం. పరిశ్రమలోని ఫర్నెస్ కంప్రెషర్ పేలిపోగా, ఆ పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలైన తీరు తలచుకుంటేనే గుండె ద్రవించిపోతుంది. శరీరాలు ఛిద్రమై, చెల్లాచెదురుగాపడిన అవయవాలను బట్టి మృతులు ఎవరో తెలుసుకోవడమే గగనమైందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సంఘటన జరిగిన సమయంలో వందకు పైగానే కార్మికులు పనిచేస్తున్నారంటూ వెలుగు చూసిన వార్తలను బట్టి, మరింత మందిని ఈ దుస్సంఘటన కబళించనందుకు సంతోషించాలో, ఐదుగురిని బలిగొని, మరో 13 మందిని క్షతగాత్రుల్ని చేసినందుకు చింతించాలో అర్ధం కాని పరిస్థితి. ఇంతటి ప్రమాదకరమైన ఈ పరిశ్రమలో కార్మికులంతా రక్షణ కిట్ లు లేకుండానే పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడటం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించని విషయం. ఎందుకంటే, ఈ ఒక్కటే కాదు, అనేక పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ప్రమాదం జరిగాక హడావిడి చేసే పరిశ్రమల శాఖ అధికారులు, పాలనా యంత్రాంగం అప్పటి వర

కూ ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించడం, క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు పంపించడం, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడమే ఘనకార్యంగా భావిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని కంకణం కట్టుకుని ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదు. షాద్‌నగర్ సంఘటననే పరిగణనలోకి తీసుకుంటే, చుట్టువక్కల వందలాది పరిశ్రమలు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రమాదం జరిగిన సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీ సమీపంలోనే ఉన్న ఒక పరిశ్రమలో గత ఏడాది బాయిలర్ పేలి నలుగురు మరణించారు. అప్పుడైనా అధికారులు కళ్లు తెరిచి తనిఖీలు నిర్వహించి ఉంటే, ఇప్పుడు ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు. చుట్టుపక్కల ఉన్న కొత్తూరు, మొగిలిగిద్ద, ఎలికట్ట తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలలో అడపాదడపా ప్రమాదాలు జరుగుతునే ఉన్నా, అధికారులకు చీమకుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. ఫ్యాక్టరీల చట్టంలోని 9వ సెక్షన్ ప్రకారం పరిశ్రమలను, వాటిలోని యంత్ర సామగ్రిని తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వం నియమించాలి. ఫ్యాక్టరీలలో జరిగే ప్రమాదాలపై కూడా సదరు ఇన్‌స్పెక్టర్లు నిఘా ఉంచాలని కూడా చట్టం చేబుతోంది.

కానీ వాస్తవంలో అధికారులు, ఇన్‌స్పెక్టర్ల పోస్టులు వందల కొద్దీ ఖాళీగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమలపై పర్యవేక్షణ లోపించడం ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. పరిశ్రమలలో పని చేసే కార్మికుల జీవితాలు గాల్లో దీపాలుగా మారడానికి కారణాలు అనేకం. అనేక పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు, కార్మికులు ఉండరు. కాంట్రాక్టు పద్ధతిపై కార్మికులను నియమించుకుని, అరకొర జీతాలతో పని చేయించుకుని పబ్బం గడుపుకునే యాజమాన్యాలే ఎక్కువ. ఇలా రోజు కూలీ తీసుకుని పని చేసే కాంట్రాక్టు కార్మికులకు యంత్రాలను నడపడంలోనూ, జాగ్రత్తలు పాటించడంలోనూ కనీస పరిజ్ఞానం ఉండదు. కార్మికులకు శిక్షణనిచ్చి పని చేయించుకోవాలనే ఇంగితజ్ఞానం యాజమాన్యాలకూ ఉండదు.అధికారులు ఎప్పుడైనా తనిఖీకి వెళ్లినా, ముందుగానే ఉప్పందుకున్న యాజమాన్యాలు రికార్డులను తారుమారు చేసి, లేని నిపుణులైన కార్మికులను ఉన్నట్లుగా చూపించి తప్పించుకుంటున్నాయి. సాధారణంగా పరిశ్రమలలో ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణం. నాసిరకం యంత్రాలు, యంత్రసామగ్రి నిర్వహణ సరిగాలేకపోవడం,పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగితే తప్పించుకునేందుకు మరో మార్గమంటూ లేకపోవడం వంటివి కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమవుతున్నాయి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే ఫ్యాక్టరీలలో ప్రమాదాలను చాలా వరకూ నియంత్రించవచ్చు. కానీ ఖర్చుకు వెరచి యాజమాన్యాలు ముందుకు రావు. కార్మికులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యాలు.. ప్రమాదం జరిగాక మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. భారతీయ పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు లోపించిన కారణంగా సగటున రోజుకు ముగ్గురు చొప్పున కార్మికులు మరణిస్తున్నట్లు, 11 మంది క్షతగాత్రులవుతున్నట్లు ఫ్యాక్టరీల స్థితిగతులపై మూడేళ్ల కిందట చేపట్టిన ఓ సర్వేలో తేలింది. పరిశ్రమల శాఖలో రిజిష్టరైన ఫ్యాక్టరీలే యథేచ్ఛగా నియమ నిబంధనలను తుంగలో తొక్కి, కార్మికుల చేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్న నేటి పరిస్థితుల్లో రిజష్టర్ కాకుండా, చట్టవ్యతిరేకంగా నడుస్తున్న పరిశ్రమలపై కొరడా ఝళిపించే నాథుడు కరువయ్యాడు. వరుసబెట్టి జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి, పరిశ్రమల శాఖను బలోపేతం చేసి, నిఘా వ్యవస్థను పటిష్ట పరిస్తే కొంతవరకైనా ఈ ప్రమాదాలకు కళ్లెం వేసే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News