దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన మహిళల ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టీనేజ్ సంచలనం, విధ్వంసక బ్యాట్స్‌విమెన్ షెఫాలీ వర్మ తిరిగి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడడంతో షెఫాలీ తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ షెఫాలీ సత్తా చాటింది. దీంతో ఐసిసి బుధవారం వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకుంది. బెత్ మూనీ (ఆస్ట్రేలియా)ని వెనక్కినెట్టి షెఫాలీ టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం షెఫాలీ 750 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
మరోవైపు సోఫి డివైన్ (న్యూజిలాండ్) మూడో, మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) నాలుగో, అలీసా హీలీ (ఆ్రస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. భారత స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన ఏడో, జెమీమా రోడ్రిగ్స్ (తొమ్మిదో) ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో సోఫి ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఎక్లెస్టోన్ 799 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. షబ్నమ్ ఇస్లాయిల్ (సౌతాఫ్రికా) రెండో ర్యాంక్‌లో, మెగాన్ షుట్ (ఆస్ట్రేలియా) నాలుగో, జెస్ జోనాసెన్ (ఆస్ట్రేలియా)లు ఐదో స్థానంలో నిలిచారు. భారత బౌలర్లు దీప్తి శర్మ ఏడో, రాధా యాదవ్ 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్, భారత్‌లు నిలిచాయి.